ఏపీలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్- రూల్స్ విడుదల- ఎవరికి, ఎన్ని రోజులు?
ఈ ఏడాది రాష్ట్రంలో వినాయక చవితి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. బొజ్జ గణపయ్యలను కొలువుదీర్చేందుకు మండపాల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఈ మండపాలకు (Ganesh Pandals) గతేడాది తరహాలోనే ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం (AP Govt) ఇప్పటికే నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఓ ప్రకటన చేశారు. దీని ప్రకారం ఈ ఏడాది గణేష్ మండపాలకు విద్యుత్ ను 9 రోజుల పాటు ఉచిత ఇవ్వబోతున్నారు.
రాష్ట్రంలో ఈ నెల 14న వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు. దీంతో ఆ రోజు నుంచి ఈ నెల 22వ తేదీ వరకూ 9 రోజుల పాటు గణేశ్ మండపాలకు తాత్కాలిక ఉచిత విద్యుత్ అందించబోతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అయితే అధీకృత గణేశ్ మండపాలకే ఈ ఉచిత విద్యుత్ వర్తిస్తుందని వెల్లడించారు. అంటే అధికారికంగా అనుమతులు తీసుకున్న మండపాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గణేశ్ మండపాలకు 3 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని వెల్లడించారు. ఇందుకోసం స్థానిక విద్యుత్ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని మండపాల నిర్వాహకులకు మంత్రి సూచించారు. అలాగే ఇలా అనుమతులు తీసుకున్న వారు. విద్యుత్ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా కనెక్షన్లు, వైరింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అధికారులు కూడా సహకరించాలన్నారు.














Click it and Unblock the Notifications
