దిశ చట్టం : పకడ్బందీ అమలుకు ఇద్దరు స్పెషల్ ఆఫీసర్స్ నియామకం
ఏపీలో మహిళా భద్రత కోసం తీసుకువచ్చిన దిశ చట్టం అమలుపై వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టింది. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దిశ చట్టం అమలును పర్యవేక్షించేందుకు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించి బాధ్యతలు అప్పగించింది. స్త్రీ సంక్షేమ శాఖ సంచాలకులు కృతికా శుక్లా, కర్నూల్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి దీపికాలను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం దిశ చట్టానికి సంబంధించిన అన్ని విధి విధానాలపై పూర్తి స్థాయి పకడ్బందీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దిశ చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణ కోసం 13 జిల్లాలకు 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటి ఏర్పాటును తాజాగా నియమించిన ప్రత్యేక అధికారులు పర్యవేక్షించనున్నారు.

అలాగే బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రత్యేక అధికారులపై ఉంటుంది. ఇందుకోసం ప్రతీ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు,బాధితులకు సామాజిక,చట్టపరమైన న్యాయాన్ని అందించడం కోసం ఈ కేంద్రాలు పనిచేయనున్నాయి. వీటిల్లో ఒక ఎస్ఐ స్థాయి అధికారి,గైనకాలజిస్టులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ కేంద్రాల్లో పనిచేయబోయే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
దిశ చట్టం అమలులో ప్రత్యేక అధికారుల పాత్ర,మిగతా సిబ్బందితో సమన్వయం తదితర అంశాలపై
చర్చించడానికి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా,దీపికలు పాల్గొంటారు. ఈ సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు,జిల్లా ఆసుపత్రుల సూపరింటెండ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై చర్చించనున్నారు
కాగా, దిశ చట్టం ద్వారా నిందితులకు 21 రోజుల్లోనే శిక్ష పడుతుంది. సరైన సాక్ష్యాధారాలు ఉంటే వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు ,14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చేయేడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. తెలంగాణలోని షాద్ నగర్ సమీపంలో చటాన్‌పల్లి వద్ద దిశ హత్యాచార ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications