ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా అనురాధ - చంద్రబాబు ఎంపిక వెనుక..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ను ఖరారు చేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి పలువురి పేర్లు రేసులో ఉన్నాయి. రిటైర్డ్ డీజీపీల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే, ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహణ .. ఉద్యోగాల భర్తీ పైన ఇచ్చిన హామీలిచ్చారు. దీంతో. ఏపీపీఎస్సీ కీలకంగా మారుతోంది. ఈ సమయంలో అనేక చర్చల తరువాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధ ను చంద్రబాబు ఎంపిక చేసారు.
అనురాధ ఎంపిక
ఏపీ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ రిటైర్డ్ మహిళా ఐపీఎస్ అనురాధను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం లో అనురాధ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమితులైన తొలి మహిళా అధికారిగా నిలిచారు. అయితే, ఆ తరువాత అనురాధ స్థానంలో ఏబీ వేంకటేశ్వర రావును చంద్రబాబు నిఘా చీఫ్ గా నియమించారు. అనురాధ ఏపీలో హోం శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో శాంతి భద్రతల అదపు డీజీగా వ్యవహరించారు.

ఏపీపీఎస్సీ ప్రక్షాళన
ఐపీఎస్ అధికారిగా సమర్ధవంతంగా పని చేసిన అనురాధను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం చేసిన సిఫార్సుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారి. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నియామకం సమయంలో ప్రభుత్వం పలువురి పేర్లను పరిశీలించింది. వైసీపీ హయాంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా పని చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన తన పదవికి రాజీనామా చేసారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ.. ఉద్యోగాల కల్పన పైన ఎన్నికల సమయంలో కూటమి నేతలు కీలక హామీలు ఇచ్చారు.
ప్రభుత్వం కసరత్తు
ఇక, వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ పరీక్షలతో పాటుగా మూల్యాంకణం పైన ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలించారు. పూనం మాలకొండయ్య, కేరళలో పనిచేస్తున్న కె.శ్రీనివాస్, గతంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో వైస్ చాన్సలర్ పనిచేసిన అప్పారావు, యలమంచిలి రామకృష్ణ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. చివరగా అనురాధను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఎంపిక చేసారు.












Click it and Unblock the Notifications