ముంచుకొస్తున్న తుఫాను, ప్రయాణాలు వద్దు..ఈ జిల్లాలకు ముప్పు- సెలవులు రద్దు..!!
రాష్ట్రానికి 'మొంథా' తుపాను ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయగుండంగా మారింది. ఉత్తర-వాయవ్య దిశగా ప్రయాణించి 28న ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రానికి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో, ప్రభుత్వం అప్రతమత్తం అయింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఎమర్జెన్సీ సేవల ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.
తుఫాను వేళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ప్రజలకు కీలక సూచనలు చేసింది. విద్యుత్ శాఖ తో సహా ఎమర్జెన్సీ సేవల ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. 28వ తేదీ కాకినాడ వద్ద తీరం దాటే వరకు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది.

తుఫాను ప్రభావిత జిల్లాల కు ప్రత్యేక అధికారులను నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు కేవీఎన్ చక్రధర బాబు, విజయ నగరం జిల్లాకు పి.రవి సుభాష్, మన్యం జిల్లాకు నారాయణ భరత్ గుప్తా, విశాఖపట్నం జిల్లాకు అజయ్ జైన్, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు వాడ్రేవు వినయ్ చంద్, తూర్పు గోదావరి కి కే కన్నబాబు, కాకినాడ జిల్లాకు విఆర్ కృష్ణ తేజ ను నియమించారు.
కోనసీమ జిల్లాకు విజయరామరాజు, పశ్చిమగోదావరి జిల్లాకు ప్రసన్న వెంకటేష్, ఏలూరు జిల్లాకు కాంతిలాల్ దండే, కృష్ణా జిల్లాకు కాటా ఆమ్రపాలి, ఎన్టీఆర్ జిల్లాకు శశి భూషణ్ కుమార్, గుంటూరు జిల్లాకు ఆర్ పి సిసోడియా, బాపట్ల జిల్లాకు ఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రకాశం జిల్లా కు కోన శశిధర్, నెల్లూరు జిల్లాకు ఎన్ యువరాజ్, తిరుపతి జిల్లాకు పి అరుణ్ బాబు, చిత్తూరు జిల్లాకు పిఎస్ గిరీషాలను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది.
జిల్లాల్లో సైక్లోన్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కాకినాడ వద్ద తీరం దాటనుండటంతో ఉభయ గోదావరి తో పాటుగా ఉత్తరాంధ్ర, క్రిష్ణా.. గుంటూరు జిల్లాలపైన ఎక్కువగా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో.. మూడు రోజులు ముందస్తుగానే పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల యాంత్రాంగానికి స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications