ఏపీ ప్రభుత్వం తాజా వ్యూహం: నేటి కేబినెట్ లో చర్చ మాత్రమేనా..!? నిర్ణయం మాత్రం సస్పెన్స్..!?
Recommended Video
ఏపీ ప్రభుత్వ చివరి నిమిషంలో వ్యూహం మార్చిందా. జీఎన్ రావు కమిటీ సిఫార్సుల అమలు..రాజధాని మార్పు పైన ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతూ వచ్చారు. కానీ, తాజా సమాచారం మేరకు కేబినెట్ లో కేవలం జీఎన్ రావు కమిటీ సిఫార్సుల మీద చర్చకు మాత్రమే పరిమతై..నిర్ణయం మాత్రం సస్పెన్స్ లో పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఒక వైపు అమరావతిలో కొనసాగుతున్న రైతుల ఆందోళన..అన్ని రాజకీయ పార్టీల నుండి వస్తున్న వ్యతిరేకత కారణంగా..ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం కంటే..ప్రస్తుతానికి నిర్ణయం ఫైనల్ చేయకూడదనే భావనలో సీఎం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇదే సమయంలో నిర్ణయం వాయిదా వేస్తే ఆందోళన మరింగా పెరిగే అవకాశం ఉందనే అనుమానమూ వెంటాడుతోంది. దీంతో..ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో తొలి నుండి భావిస్తున్నట్టుగా రాజధాని మార్పు పైన తుది నిర్ణయం తీసుకుంటారా..లేక, ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కేవలం కమిటీ సిఫార్సుల పైన చర్చించది..నిర్ణయం మాత్రం ఈ రోజు సమావేశంలో తీసుకోకుండా పెండింగ్ లో పెడుతారా అనేది ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది.

ఫైనల్ చేస్తుందా..పెండింగ్ పెడుతుందా..
అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల మీద ప్రతిపాదన చేసిన సమయంలో ఒక కీలక వ్యాఖ్య చేసారు. కమిటీ నివేదిక వచ్చిన తరువాత అందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని నాడు చెప్పుకొచ్చారు. సీఎం చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చింది. మంత్రులు..విజయ సాయిరెడ్డి లాంటి వారు మాత్రం ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపి..తుది నిర్ణయం తీసుకుంటారని..ఇక నుండి విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుందని ముందుగానే చెబుతున్నారు.
అయితే, తాజాగా ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల నుండి అందుతున్న సమా చారం మేరకు ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది కానీ..నిర్ణయం మాత్రం ఫైనల్ చేయరని తెలుస్తోంది. దీని పైన ముఖ్యమంత్రి నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. సీఎం ఆలోచనకు అనుగుణం గా తుది నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఏకపక్ష నిర్ణయం కాకూడదనేనా..!
ఏపీ కేబినెట్ లో జీఎన్ రావు కమిటీ సిఫార్సుల పైన చర్చ చేసినా..చివరి నిమిషంలో నిర్ణయం ప్రకటిస్తారా లేక పెండంగ్ పెడతారా అనే చర్చకు అనేక కారణాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో మాత్రమే చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే..గతంలో చంద్రబాబు అమరావతి తరహాలోనే తీసుకున్న నిర్ణయంగా ఉంటుందని కొందరు సీనియర్లు సూచిస్తున్నట్లు సమాచారం.
దీంతో పాటుగా రాజధాని ప్రాంతంలోని రైతులకు ప్రభుత్వం ఏ రకంగా అండగా నిలిచేదీ స్పష్టత ఇవ్వకుండా తుది నిర్ణయం తీసుకుంటే..అది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, ప్రతిపక్ష పార్టీ లు మొత్తం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో రాజకీయంగా జరిగే లాభ నష్టాల మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో..నిర్ణయం కంటే..ముందుగా చర్చించి ఆ తరువాత నిర్ణయం తీసుకొనే విధంగా చివరి నిమిషంలో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ తరువాతనే తుది నిర్ణయం..!?
ఇక, నేడు కేబినెట్ లో ప్రభుత్వం రాజధాని కమిటీ సిఫార్సుల పైన చర్చించి..దీని పైన ఏ రకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని మేరకు ముందుగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టి..దీని పైన అందరు మంత్రుల అభిప్రాయాలు తీసుకున్న తరువాత సీఎం ఫైనల్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
అయితే, ఇప్పుడు నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేస్తే మరింతగా ఆందోళన లు పెరిగే అవకాశం ఉందనే అనుమానమూ ప్రభుత్వంలో వ్యక్తం అవుతోంది. దీంతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి..అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి..ప్రభుత్వ తుది నిర్ణయం ఏరకంగా ఉంటుందో మరి కాసేపట్లో తేలే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications