ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయ్- చంద్రబాబు భావోద్వేగం- మోడీపై ప్రశంసల జల్లు..!
అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం చంద్రబాబు (chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్ పోర్టు నిర్మాణానికి సహకరించిన రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. వారు ఉత్తరాంధ్రకు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని, భవిష్యత్తు ఇచ్చారు. ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వచ్చాయన్నారు. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తామని తాను, పవన్ కళ్యాణ్, మోడీ హామీ ఇచ్చామని, దాన్ని ఇప్పుడు నిలబెట్టుకున్నామని చంద్రబాబు గుర్తుచేశారు.
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయన్నారు. ఎర్రబస్సు రాదని విపక్షాలు చెప్పాయని, కానీ తాము ఎయిర్ బస్సు తెచ్చామన్నారు. వారు మాత్రం అడ్రస్ లేకుండా పోయాయన్నారు. ఉత్తరాంధ్ర ఆశలు, ఆకాంక్షల్ని తక్కువ చేశారని, అడ్డుపడ్డారని, అన్నీ అధిగమించి ఎయిర్ పోర్టు తీసుకురావడం ఉత్తరాంధ్రకు గర్వకారణం అన్నారు. గిరిజనులతో కలిసి స్వాతంత్ర పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఉత్తరాంధ్ర శక్తికి ఈ ఎయిర్ పోర్టు నిదర్శనం అన్నారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మించింది కూడా ఉత్తరాంధ్ర వాసి జీఎంఆర్ అన్నారు. అలాగే ఈ ఎయిర్ పోర్టుకు తొలి అడుగు వేసిన అశోక్ గజపతిరాజు, దీని నిర్మాణ బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడు కూడా ఉత్తరాంధ్ర వాసులే అన్నారు.

వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ అని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది కూడా ఆయనే అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చిన వ్యక్తి కూడా అన్నారు. రాజధాని పనుల్ని పునఃప్రారంభించి, పోలవరాన్ని పూర్తి చేసేందుకు సహకరిస్తున్నారని మోడీపై ప్రశంసలు కురిపించారు. 2027లో పోలవరాన్ని పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2028లో అమరావతి మొదటి దశ పనుల్ని పూర్తి చేసి తిరిగి ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు కొబ్బరికాయ కొట్టిందీ తామేనని, గుమ్మడికాయ కడుతోందీ తామేనన్నారు.

రెండేళ్లలో ప్రధాని సహకారంతో ఉత్తరాంధ్రలో 6 కోట్ల 13 లక్షల పెట్టుబడులతో 189 ప్రాజెక్టులు చేపట్టి 5.57 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్రలో 2384 కోట్లతో ఏడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. 65 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేసిందని, ఈ నెల 14న గోదావరి నీటిని ఉత్తరాంధ్రకు తెస్తామన్నారు. గోదావరి, వంశధారను అనుసంధానం చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇలా లేనిదంటూ లేదన్నారు. వీటితో ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయన్నారు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవన్నారు. వేరే ప్రాంతాల నుంచి శ్రీకాకుళం నుంచి వలసలు వచ్చే రోజు త్వరలోనే ఉందన్నారు. ప్రతీ వ్యక్తికీ అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నామని, వాటిని అందిపుచ్చుకోవాలని కోరారు.
ఐటీ నుంచి ఏఐకి ప్రపంచం మారుతోందని, భారత్ కు సరైన సమయంలో, సరైన నాయకత్వం ఇవ్వగల నిరూపితమైన నేత ప్రధానిగా ఉన్నారంటూ చంద్రబాబు మోడీపై ప్రశంసలు కురిపించారు. గత 12 ఏళ్లుగా డిజిటల్ మౌలిక సదుపాయాలు దేశానికి లభించాయని, ప్రపంచంలో అత్యంత ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు భారత్ లోనే జరుగుతున్నాయని, అమెరికా, చైనా వంటి దేశాల్ని కూడా ఇలాంటి విషయంలో అధిగమించామన్నారు. అవినీతి లేకుండా ప్రతీ ఒక్కరికీ నేరుగా పథకాల నగదు అందిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా మనలాంటి జాతీయ రహదారులు, రైల్వేలు లేవన్నారు. ఇప్పుడు మోడీ హయాంలో గ్రీన్ హైడ్రోజన్ రైలు కూడా వస్తోందన్నారు. అత్యంత గొప్ప విదేశాంగ విధానాన్ని కూడా మనకు అందించారన్నారు.

1979లో తాను తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని, 1980లో తొలిసారి మంత్రి అయ్యానని, కానీ మోడీ రూపంలో తాను స్పష్టమైన అజెండా కలిగిన నేతను చూశానని చంద్రబాబు తెలిపారు. ప్రతీసారీ ఆయన నేషన్ ఫస్ట్ అనే సింగిల్ అజెండాతో పనిచేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. అలాంటి నేతను తాను ఎక్కడా చూడలేదన్నారు. వికసిత్ భారత్ 2047 కల్లా ప్రపంచ పటంలో భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు మోడీ పనిచేస్తున్నారన్నారు. నరేంద్ర మోడీ లేకుండా మనం 2047ను ఊహించలేమన్నారు. మోడీ ఎక్కడికెళ్లినా ప్రశంసలు అందుకుంంటున్నారని కితాబిచ్చారు.














Click it and Unblock the Notifications