రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - హెక్టారుకు రూ 50 వేలు ఖాతాల్లో జమ..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. ఉల్లి రైతులను ఆదుకోవాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం హెక్టారుకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే లా కసరత్తు జరుగుతోంది. ఫలితంగా కర్నూలు, కడప జిల్లాల్లోని 20,913 మంది రైతులకు రూ. 104.57 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. ఈ-పంట ఆధారంగా ఈ సహాయం అందుతుందని అధికారులు వెల్లడించారు.
ఉల్లి రైతులకు అండగా నిలవాలని.. ఆర్దిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. దీనివల్ల 45 వేల ఎకరాల్లో ఉల్లి పండించిన రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే ఉల్లి కొనుగోలులో మార్కెటింగ్ శాఖ, మార్క్‌ఫెడ్ కీలక పాత్ర పోషించాయి. క్వింటాల్ ఉల్లి రూ.1,200 చొప్పున, మొత్తం రూ.18 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. దీనికి సంబంధించి రూ.10 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించారు. మిగిలిన రూ.8 కోట్లను కూడా త్వరలోనే అందిస్తామని మంత్రి అచ్చన్నాయుడు వెల్లడించారు. వివిధ పరిస్థితుల కారణంగా ఈసారి క్వింటా ఉల్లి రూ.600 కంటే ఎక్కువ ధర పలకలేదు. దీంతో ప్రభుత్వం క్వింటా రూ.1,200 చొప్పున సుమారు లక్షా 39 వేల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది.

ఇక, కర్నూలు మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లిని దాదాపుగా సేకరించింది. కొంత ఉల్లిని రైతు బజార్లకు, మరికొంత ఉల్లిని వ్యాపారులకు తరలించి విక్రయించింది. అయినప్పటికీ కొంతమంది రైతుల వద్ద ఇంకా ఉల్లి మిగిలి ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం.. ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టారుకు రూ.50వేల చొప్పున అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించిన నియమనిబంధనల మేరకు లబ్దిదారులకు సాయం అందనుంది. ఇక.. మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్దిక సాయం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తుఫాను కారణంగా దాదాపు రూ 5,245 కోట్ల మేర రాష్ట్రానికి నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి నివేదిక పంపారు. తక్షణ సాయం కోరారు. పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. దీంతో.. రైతులకు అండగా నిలిచేలా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది.












Click it and Unblock the Notifications