అమరావతి కేంద్రంగా జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!!
అమరావతి కేంద్రంగా ఏపీ ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్-5 జోన్ లో భూముల కేటాయింపు పైన న్యాయస్థానంలో అనుకూల తీర్పు రావటంతో ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి మరో 268 ఎకరాలు కేటాయిస్తోంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 50 వేల మంది పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 1,134 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పుడు మరో 268 ఎకాల భూమి కేటాయింపుకు నిర్ణయించింది.
268 ఎకరాల భూ కేటాయింపు:ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల యంత్రాంగాల నుంచి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను అందించేందుకు తాజాగా ప్రతిపాదనలు వచ్చాయి. రాజధానిలోని ఎస్-3 జోన్‌లో ఉన్న బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లోని 268 ఎకరాల భూములకు ధర కట్టి విక్రయించేందుకు తమ సమ్మతిని తెలియచేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బహుళ ప్రయోజనాల అవసరాల కోసం నిర్దేశించిన ఎస్-3 జోన్‌లో ఎకరం ధర రూ.4.1 కోట్లని ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన జరిగిన 33వ సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పుడు అందులో 6 శాతం ధరకే అంటే.. ఎకరా రూ.24.40 లక్షల చొప్పున 268 ఎకరాలను ప్రభుత్వానికి విక్రయించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.

ప్రతిపాదనలకు ఆమోదం:'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల కోసం తీసుకుంటున్నందున మౌలిక ధరలో ఆరు శాతానికే విక్రయించడానికి నిర్ణయించినట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి 168 ఎకరాలకు ప్రతిపాదన రాగా.. బోరుపాలెంలో 2.05 ఎకరాలు, పిచ్చుకల పాలెంలో 20.47 ఎకరాలు, పిచ్చుకలపాలెంలోనే మరో 81.09 ఎకరాలు, అనంతవరం లో 64.39 ఎకరాలు కేటాయించారు. అలాగే గుంటూరు జిల్లా పరిధిలో నిర్దేశించిన వంద ఎకరాలను నెక్కల్లు గ్రామంలో కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లాకు నిర్దేశించిన 168 ఎకరాలకు రూ.41.33 కోట్లు, గుంటూరు జిల్లాకు నిర్దేశించిన 100 ఎకరాలకు రూ. 24.60 కోట్లు.. మొత్తంగా 268 ఎకరాలకు రూ.65.93 కోట్లుగా సీఆర్‌డీఏ తేల్చినట్లు సమాచారం.
పేదలకు ఇస్తే తప్పేంటి:హైకోర్టు లో ఆర్-5 జోన్ లో భూముల కేటాయింపు పైన అనుకూల తీర్పు రావటంతో ఈ నెల 18న పేదలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు అందించేలా ముహూర్తం నిర్ణయించారు. రైతులు హైకోర్టు నిర్ణయం పైన సుప్రీంను ఆశ్రయించారు. ఇటు ప్రభుత్వం తాజాగా మరో 268 ఎకరాల భూమి కేటాయింపు పైన నిర్ణయం తీసుకోవటంతో రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నం పై ఏపీ పరిరక్షణ సమితం రాష్ట్ర అధ్యకుడు కొలికపూడి శ్రీనివాసరావు నేటి నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి భూములు ప్రభుత్వానివని.. అందులో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే తప్పేంటని మంత్రి బొత్సా ప్రశ్నించారు. ప్రభుత్వ భవనాలే కాకుండా నివాసాలు ఉంటాయని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications