రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీపై కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని కూటమి ప్రకటించింది. అందుకు అనుగుణంగా నూతనంగా ఆయా పాస్ పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్రతో ఉన్న వాటిని పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.
పుస్తకాలు సిద్దం
ఏపీలో ప్రభుత్వ చిహ్నంతో భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు వీలుగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సుల్లో వీటిని అందించాలని భావిస్తోంది. ఇందు కోసం 34 లక్షల పాస్ పుస్తకాలు అవసరమవుతాయని ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. గత వైసిపి ప్రభుత్వం జగన్ బొమ్మతో పంపిణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో విస్తీర్ణం, భూ యజమాని పేర్లతోపాటు పలు అంశాల్లో తప్పులు నమోదైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

వరుస ఫిర్యాదులతో
దీంతో పట్టాదారు పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులకు సంబంధించి సిసిఎల్‌ఎ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తూ తప్పులు ఎక్కడ దొర్లాయనే గుర్తించే విధంగా రెవెన్యూ సిబ్బంది నిశితంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన ప్రాధమిక సమాచారం మేరకు ముఖ్యంగా అసైన్డ్, దేవాదాయ భూములు, భూ ఆక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్, వెబ్‌ల్యాండ్‌లో భూ యజమానుల పేర్ల మార్పు వంటి అంశాలకు సంబంధించిన అర్జీలు ప్రజల నుంచి భారీగా రావచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
వివాదాలు లేకుండా
దీంతో, జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రెవెన్యూ సిబ్బంది తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలను మంజూరు చేయకపోతే భవిష్యత్తులో భూ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. వెబ్‌ల్యాండ్‌లో భూ యజమానుల పేర్లు తప్పుగా నమోదు చేయడం, విస్తీర్ణంలో తేడాలు పరిష్కరించలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికల హామీ మేరకు గతంలో జగన్ బొమ్మతో పంపిణీ చేసిన పాస్ పుస్తకాలను రెవెన్యూ అధికారులు భూ యజమానుల నుంచి వెనక్కి తీసుకున్నారు. వివాదాలు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications