కొత్త రేషన్ కార్డుల జారీ పై కీలక అప్డేట్..!!
ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు దారులు వేచి చూస్తున్నారు. దాదాపుగా ఏడాది కాలంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. గత ప్రభుత్వ హాయంలో రేషన్ కార్డు కు ఆమోదం లభించినా ఇంకా చాలామందికి కార్డులు మంజూరు కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటన చేసింది. కానీ, ఇప్పటి వరకు అధికారికంగా మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు.
కొత్త కార్డుల కోసం
కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. రేషన్ కార్డుల కోసం సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగా వివాహమైన వారికి వివాహ ధ్రువీకరణ పత్రం చూపిస్తే, కార్డులు ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ప్రకటించినా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. కొత్త దరఖాస్తుల స్వీకరణ, గతంలో దరఖాస్తు చేసి అర్హత ఉందని కోడ్ నంబరు ఇచ్చిన వారికి జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. గత వైసిపి ప్రభుత్వం ఏటా జులై, డిసెంబరుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు కార్డులను జారీ చేసింది.

దరఖాస్తులు
గతేడాది జులైలో వరకూ ఈ ప్రక్రియ సాగింది. డిసెంబర్‌లో నిల్చిపోయింది. ఆ తరువాత ఎన్నికల కోడ్ రావడంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. ఎన్నికల అనంతరం కొత్త కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పించడం లేదు. గతంలో వేర్వేరు కారణాల వల్ల కార్డు కోల్పోయిన వారికి తిరిగి అర్హత సాధించినా దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం లేదు. పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డు ప్రభుత్వోద్యోగులు కార్డులో సభ్యుడిగా ఉంటే గతంలో బియ్యం కార్డు రద్దు చేశారు.
కసరత్తు
2021లో నవశకం సర్వే పేరుతో రాష్ట్రంలో ఏడు లక్షల రేషన్ కార్డులను వైసిపి ప్రభుత్వం తొలగించింది. వీటిలో 60 శాతం కార్డులను అర్హత ఉన్నా సాంకేతిక కారణాలు చూపి తొలగించారని విమర్శలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి అడుగుల స్థలంలో ఇల్లు ఉన్నా కార్డు తొలగించారు. విద్యుత్ బిల్లులు, ఐటి రిటర్నులు, నాలుగు చక్రాల వాహనం, ఇంట్లో మరో కుటుంబ సభ్యుడు ప్రభుత్వం నుంచి పింఛను తీసుకున్నా కార్డు నిలిపివేశారు. పెండింగ్ దరఖాస్తుల పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దసరా లోగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications