ఏపీ ప్రభుత్వం పై రోజుకు 450 పిటీషన్లు - ఎదుర్కొంటున్న కేసులు 1.94 లక్షలు : జగన్ పాలనపై ఎఫెక్ట్..!!
ఈ మధ్య కాలంలో ప్రభుత్వం పైన అనేక పిటీషన్లు న్యాయస్థానాల్లో దాఖలవుతున్నాయి. ప్రభుత్వం సైతం కోర్టులకు వెళ్లి తమ నిర్ణయాలను అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్షాల పైన ఆరోపణలు చేస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఒక ఆసక్తి కర కధనం ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న కేసులు- ఆ ప్రభావం సాధారణ పరిపాలన మీద ఏ రకంగా చూపుతుందో అందులో పేర్కొంది. ఇదే సమయంలో పలు ఆసక్తి కర అంశాలను వెల్లడించింది. ఏడాది కిందటి వరకు ఏపీ హైకోర్టులో 2.03 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయి.

ఏపీ ప్రభుత్వంపై రోజూ సగటున 450 కొత్త వ్యాజ్యాలు ..
అయితే... ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి ఏపీ ప్రభుత్వం 1.94 లక్షల కేసులను ఎదుర్కొంటోందని పీటీఐ పేర్కొంది. దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త వ్యాజ్యాలు దాఖలవుతున్నాయని కధనంలో స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాలను ఎదుర్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు కూడా భారీగా చేయాల్సి వస్తోందని అందులో పేర్కొంది. అయితే, ప్రస్తుతం కోర్టు ధిక్కరణ కేసుల సంఖ్య 8 వేలుగా కధనంలో వివరించింది. కొత్తగా దాఖలవుతున్న కేసుల్లో పిటీషనర్లు పేర్కొన్న అంశాల పైన సమాధానం ఇవ్వటానికి రోజుకు 40 వేల పేజీల వర్క్ చేయాల్సి వస్తుందంటూ అధికారులు వివరించినట్లు అందులో చెప్పుకొచ్చారు. కోర్టు వ్యవహారాల కారణంగా సాధారణ పరిపాలన మీద ప్రభావం పడుతుదంటూ అధికారులు వాపోతున్న అంశాన్ని ప్రస్తావించారు.

8 వేల కోర్టు ధిక్కరణ కేసులు..
అనేక అంశాల్లో న్యాయస్థానాల ఆదేశాలను అమలు చేయనందుకు వివిధ స్థాయుల్లోని ప్రభుత్వ అధికారులు 8 వేల కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కొంటున్నారని పీటీఐ తెలిపింది. యంత్రాంగం నిర్లిప్తత, నిర్లక్ష్యంతో పాటు సర్కారు విధానాలు కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం. బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగి నుంచి సామాన్య పౌరుడి వరకు ఉంటున్నారు. వారంతా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై పడుతున్న కేసుల సంఖ్య 30 శాతం పెరిగిందని కధనంలో వివరించారు. ఇక, జగన్ ప్రభుత్వం రాక ముందు సైతం కోర్టులో కేసులు -ప్రభుత్వం పైన పిటీషన్లు దాఖలయ్యేవి. అందులో దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని కేసులు సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

కోర్టు ముందుకు ఐఏఎస్-ఐపీఎస్ లు..
అయితే, ఈ మధ్య కాలంలో పలువురు ఐఏఎస్- ఐపీఎస్ అధికారులు కోర్టు ముందు హాజరు కావాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తాజాగా..కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు ఓ ఐఏఎస్ అధికారికి, ఓ ఐఎఫ్ఎస్ అధికారికి గత నెలలో 9 రోజుల సాధారణ శిక్ష విధించింది. అయితే వారు పదే పదే వేడుకోవడంతో దానిని సవరించింది. ఆ రోజున కోర్టు కార్యకలాపాలు ముగిసేవరకు నిలబడి ఉండాలని ఆదేశించింది. చెరో రూ.1,000 చొప్పున జరిమానా విధించింది. ధిక్కార కేసులపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఓ అంతర్గత నివేదిక సిద్ధం చేసింది.
Recommended Video

ఆదేశాలు అమలు విషయంలో కోర్టుల ఆగ్రహం..
పెండింగ్‌లో ఉన్న 143 ధిక్కార కేసులకు సంబంధించి అధికారులు చాలా వాటిలో కోర్టులో కౌంటర్ అఫిడవిట్లే దాఖలు చేయలేదని అందులో పేర్కొంది. రిట్ పిటిషన్లలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేశారా లేదా అని అడిగితే.. చాలా కేసుల్లో 'నో' అని అధికారులు సమాధానమిచ్చినట్లుగా పీటీఐ తన కధనంలో వివరించింది. పలు సివిల్ పనులను పూర్తిచేసినా బిల్లులు చెల్లించడంలేదంటూ ఓ కాంట్రాక్టరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనికి జవాబివ్వాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గత ఏడాది అక్టోబరు 21న నోటీసులు జారీచేస్తే.. వాటిపై ఆయా శాఖల అధికారులు ఇంతవరకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. వారి తీరును ఈ నెల 23న జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టిన అంశాన్ని ఈ కధనంలో ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications