అమ్మో ఒకటో తేదీ, పది వేల కోట్లు చెల్లింపులు - చంద్రబాబు ప్లాన్ ఏంటి..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం పాలన మొదలైంది. ఆర్దిక కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. చంద్రబాబుకు..నూతన ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ కు ఆర్దిక నిర్వహణ సవాల్ గా మారుతోంది. జూలై 1న ఏడు వేలు చొప్పున పెన్షన్.. ఉద్యోగులు, పెన్షనర్ల కోసమే పెద్ద ఎత్తున నిధులు సమీకరించాల్సి వస్తోంది. ఇందుకు గాను రూ 10 వేల కోట్లు అవసరం. ఇక..ఎన్నికల హామీలు అమలు చేయాలంటే ఏం చేస్తారనేది కీలకంగా మారుతోంది.
ఒకటో తేదీ భారం
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి నెల చెల్లింపులు భారంగా మారుతున్నాయి. జూలై 1న పెంచిన ఫెంచన్ రూ 4 వేల తో పాటుగా అదనంగా మూడు నెలల పాటు ఇస్తామని హామీ ఇచ్చిన రూ 3 వేలు కలుపుకొని దాదాపు అన్ని రకాల ఫించన్ల కోసం రూ 4,408 కోట్లు చెల్లించాల్సి ఉంది. అదే విధంగా ప్రతీ నెల ఉద్యోగులకు చెల్లించే వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే మొత్తం రూ 5,500 కోట్లుగా ఉంది. ఈ మొత్తం జూలై 1న చెల్లించాలి. గత ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా బహిరంగ మార్కెట్ నుంచి రూ 4 వేల కోట్ల రుణం తీసుకుంది.

రుణ ప్రయత్నాలు
దీంతో కలిపి ఏప్రిల్, మే, జూన్4 వరకు రూ 25 వేల కోట్ల రుణం తీసకున్నట్లయింది. మొత్తం వినియోగించాల్సిన రుణ వెసులుబాటును బకాయిల చెల్లింపుకు వినియోగించింది. దీంతో, కొత్త ప్రభుత్వం ఈ నెల 11న రుణం తీసుకోవాలని ప్రయత్నించినా..చివరి నిమిషంలో విరమించుకుంది. ఇక..జూలై1న దాదాపు రూ 10 వేల కోట్ల మేర చెల్లింపులు ఉండటంతో వచ్చే వారం రుణసమీకరణ చేసి ఆ నిధులను జీతాలు, సామాజిక పెన్షన్లు, ఉద్యోగుల ఫించన్ల కోసం వినియోగించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా సమీకరిద్దాం
ప్రతీ ఆర్దిక సంవత్సంలో కేంద్రం తొలి తొమ్మది నెలలకు రుణ పరిమితి నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు రూ 47 వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. జగన్ ప్రభుత్వం రూ 25 వేల కోట్లు సమీకరించింది. సెప్టెంబర్ వరకు మరో రూ 22 వేల కోట్లు బహిరంగ మార్కెట్ లో రుణం తీసుకొనే అవకాశం ఉంది. రాబోయే పది రోజుల రాబడులు, కొంత రుణం, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను కలిపి జూలై 1 అవసరాలు తీర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications