టీచర్లకు జగన్ ప్రభుత్వం తీపి కబురు..!!
అమరావతి: దసరా పండగ వేళ.. పాఠశాలల్లో పని చేస్తోన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ విడుదల చేశారు. ఉపాధ్యాయులందరికీ భారీ ఎత్తున పదోన్నతులు లభించడం ఖాయమైంది. అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానొపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లను వర్తింపజేయనుంది ప్రభుత్వం.
ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్స్, గ్రేడ్-2 హెడ్‌మాస్టర్లను పదోన్నతుల జాబితాలో చేర్చింది. సెకెండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్స్ ప్రాథమిక సీనియారిటీ జాబితాను ఈ నెల 7వ తేదీన వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తుంది. ఈ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఏవైనా ఉంటే- ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 8వ తేదీలోగా ఈ అభ్యంతరాలను పాఠశాల విద్య మంత్రిత్వ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.

అలా అందిన ఫిర్యాదులు, అభ్యంతరాలను సంబంధిత అధికారులు ఈ నెల 9వ తేదీన పరిశీలిస్తారు. తుది సీనియారిటీ జాబితాను 10వ తేదీన విడుదల చేస్తారు. గ్రేడ్-2 పోస్టుల ప్రమోషన్లను ఈ నెల 11వ తేదీన విడుదల చేస్తారు. స్కూల్ అసిస్టెంట్లు దానికి సమానమైన ఇతర పోస్టుల పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్.. ఈ నెల 12, 13 తేదీల్లో విడుదల అవుతుంది. దీని ప్రకారం వారికి ప్రభుత్వం ప్రమోషన్లను కల్పిస్తుంది.

3,4,5 తరగతులను ప్రభుత్వం ఉన్నత పాఠశాలలుగా పరిగణనలోకి తీసుకుంది. దీనివల్ల 30 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉంది. కొత్తగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జూనియర్ కళాశాలలను అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా- స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్, గెజిటెడ్ హోదా ఉన్న ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపల్ స్థాయిలో ప్రమోషన్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

మండల స్థాయిలో ఇద్దరు ఎంఈఓలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో- దానికి అనుగుణంగా పదోన్నతులు ఉంటాయని చెబుతున్నారు. దీనివల్ల డివిజన్, జిల్లా స్థాయిలో కూడా ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దానివల్ల పదోన్నతుల పరిధి మరింత విస్తృతమౌతుందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications