ఉద్యోగుల బదిలీలు, మినహాయింపులు - ప్రభుత్వ తాజా నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల పైన ఫోకస్ చేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల బదిలీ అంశం పైన చర్చ జరిగింది. ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కార్యాలయాల్లో కొంత మార్పు కనిపించాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో కొన్ని కీలక శాఖలకు చెందిన వారికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
ప్రభుత్వ కసరత్తు
ఏపీలో కొత్త ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల పైన కసరత్తు చేస్తోంది. తాజా మంత్రివర్గ సమావేశంలో జరిగిన చర్చ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పంచాయితీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది, పోలీసులు.. ఇలా ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే శాఖల్లోని ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజల రోజువారీ వ్యవహారాలతో సంబంధాలు లేని ఉపాధ్యాయులు, వైద్యులు వంటి వారికి ప్రస్తుతం బదిలీలు చేపట్టాల్సిన అవసరం లేదని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది.

ప్రయివేటు దుకాణాలు
మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాల పైన చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం షాపుల స్థానంలో ప్రైవేటు మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేబినెట్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అక్టోబరు మొదటివారంలో ప్రైవేటు షాపులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు మంత్రివర్గ సమావేశంలో వెలువడ్డాయి. అధికారిక అజెండా తరువాత సీఎం చంద్రబాబు మంత్రులకు పలు అంశాల పైన దిశా నిర్దేశం చేసారు. జగన్ పైన ప్రజల్లో తిరుగుబాటుకు కారణాలను గమనంలోకి తీసుకోవాలని మంత్రులకు సూచించారు.
మంత్రులకు దిశానిర్దేశం
ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో నియంతృత్వ వైఖరి ప్రదర్శించవద్దని చంద్రబాబు స్పష్టం చేసారు. కక్ష సాధింపులకు దిగవద్దు. గతంలో తప్పులు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దామన్నారు. చట్టాన్ని మనమే చేతుల్లోకి తీసుకొని శిక్షించాలనే ప్రయత్నం చేయొద్దని చెప్పారు. మన క్యాడర్‌ను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలని చంద్రబాబు సూచించారు. భూముల సర్వేకోసం జగన్‌ఫొటో, పేరుతో తయారు చేసిన సర్వే రాళ్లను తొలిగించాలని మంత్రులు సూచించగా.. వాటిని ఏదో రకంగా వాడుకుందామని, వృథా అయితే చేయబోమని ముఖ్యమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications