ఉచిత ప్రయాణంపై మహిళలకు మరో గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిరంతరం ఈ పథకం అమలును నేరుగా సమీక్ష చేస్తోంది. కాగా.. పథకం వినియోగించుకుంటున్న మహిళలకు మరో గుడ్ న్యూస్ అందింది. ఈ పథకం మరింతగా విస్తరించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆదరణ పెరుగుతోంది. ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకానికి భారీ స్పందన కనిపిస్తోంది. ఇప్పటికే పలు కేటగిరీల బస్సుల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. కొన్ని కేటగిరీలను మాత్రం మినహాయించారు. తొలుత ఘాట్ రోడ్ల సర్వీసుల్లో పథకం అమలు చేయరాదని భావించారు. అయితే, మహిళల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు తిరుమల కు వెళ్లే ఘాట్ రోడ్లలోనూ అమలు చేస్తున్నారు.

కాగా.. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇక నుంచి సిటీలు, పల్లెటూర్లకు తిరిగే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం మహిళా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం గుర్తింపు కార్డులు చూపించి మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.
ఏపీఎస్ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు సీఎం చంద్రబాబు తాజాగా చేసిన సమీక్షలో వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం, పెరుగుతున్న పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బస్సులను తీసుకువస్తున్నారు. భవిష్యత్తులో కొనుగోలు చేసే ప్రతి కొత్త బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రానికి మొత్తం 1050 విద్యుత్ బస్సులు త్వరలోనే రానున్నాయి.
వీటిని రాష్ట్రంలోని వివిధ డిపోలకు కేటాయిస్తారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయణ సౌకర్యం కల్పించనున్నారు. దీని ద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్న కేటగిరీలే కాకుండా మహిళలకు ఈ బస్సుల్లోనూ అవకాశం దక్కుతుంది. అయితే.. పల్లెలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళలకు ప్రయోజన కరంగా మారనుంది.












Click it and Unblock the Notifications