అమల్లోకి మహిళలకు ఉచిత బస్సు, అన్నా క్యాంటీన్లు..!!
ఏపీ ప్రభుత్వం హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. పెన్షన్ రూ 4 వేలకు పెంచటంతో మిగిలిన హామీల పైన కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే అన్నాక్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు ముమ్మరం గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే విధంగా సూపర్ సిక్స్ హామీల్లో ఒకటిగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు పథకాల ప్రారంభానికి ముహూర్తం సైతం ఖరారైంది.
అన్నా క్యాంటీన్ల ప్రారంభం
ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. పేదలకు మూడు పూటలా అన్నం పెట్టి ఆదుకునే అన్న క్యాంటీన్లను వచ్చే నెలలో పునః ప్రారంభించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు క్యాంటీన్లను ఓపెన్ చేసే విషయాన్ని ఏపీ సర్కార్ పరిశీలిస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏపీలో 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15కి పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.

మహిళలకు ఉచిత బస్సు
5 రూపాయలకే కడుపు నిండా మూడు పూటలా టిఫిన్, భోజనం పెట్టే అన్న క్యాంటీన్ల ఓపెనింగ్ కోసం రూ.20 కోట్లతో మరమ్మతులు చేస్తున్నారు. ఇక.. మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం స్కీంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.అన్న క్యాంటీన్లను ఆగష్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని సైతం మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.
మంత్రివర్గంలో నిర్ణయం
ఈ పధకం అమలు విధానంపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. అయితే, కొత్త బస్సులు రాకుండా ఈ పథకం మొదలు పెడితే ఎదురయ్యే ఇబ్బందులను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లోని బస్సుల్లో ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 16న జరిగే మంత్రివర్గం సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆగష్టు 15న సీఎం చంద్రబాబు విశాఖ వేదికగా ఈ రెండు పథకాలను ప్రారంభించేలా అడుగులు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications