ఎన్నికల వేళ అమరావతి పై ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ - విపక్షాలకు చెక్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. పొత్తులతో విపక్షాలు..సింగిల్ గా అధికార వైసీపీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి ప్రధాన అంశంగా మారుతోంది. అందునా మూడు రాజధానుల వ్యవహారం మరింత కీలకం కానుంది. అమరావతికి కట్టుబడి ఉన్నామని చెబుతూ ఆ ప్రాంతంలో వైసీపీ పైన ప్రతిపక్షాలు పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమయంలోనే అధికార వైసీపీ అమరావతి పై మాస్టర్ స్కెచ్ అమలుకు సిద్దం అవుతోంది.
ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు:ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్ పాలనా..పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. వచ్చే నెల 11న విచారణకు రానుంది. రానున్న సెప్టెంబర్ నుంచి ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన సాగించేందుకు నిర్ణయించారు.

ప్రతిపక్షాలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా అమరావతి పరిధిలో రాజకీయంగా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో..ఇప్పుడు అమరావతిలోనే కొత్త ప్రణాళికలతో ఆ ప్రాంతం పైన అభివృద్ధితో పట్టు సాధించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
ప్రభుత్వం కసరత్తు:రాష్ట్రంలో నగరాలు..పట్టణాల నవీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. స్వచ్ఛనగరాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్‌లు సిద్దం అవుతున్నాయి. అందులో భాగంగానే విజయవాడ అమరావతిని కలుపుతూ మెట్రోపాలిటన్ నగరంగా మార్చే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. విజయవాడ బైపాస్ రోడ్డు వారధిగా నిలవనుంది.
గన్నవరం పెద్దవుటపల్లి నుంచి గుంటూరు ఎన్నారై మెడికల్ కళాశాల వరకు ఏర్పాటుకానున్న ఈ బైపాస్‌లో భాగంగా కృష్ణానదిపై మరో వంతెన నిర్మితమవుతోంది. ఇబ్రహీంపట్నం ఫెర్రి దగ్గర నుంచి తుళ్లూరు మండలం వెంకటపాలెం మీదుగా ఎన్నారై కళాశాల వరకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ వారధికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తికావచ్చింది.

ప్రతిపక్షాలకు చెక్:విశాఖ మెట్రోపాలిటన్ నగరంలోనే అభివృద్ధిని కేంద్రీకరించారనే విమర్శలకు చెక్ పెడుతూ అదే తరహాలో విజయవాడ - అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. సుందరీకరణ.. నవనీకరణకు మున్సిపల్ శాఖ ప్రాధాన్యత ఇస్తోంది. మౌలిక వసతులు, సమీప గ్రామాల విలీనంతో అర్గనైజేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సేవల రంగ విస్తరణ దిశగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.
దీని ద్వారా టీడీపీ ప్రభుత్వం అమరావతిలో చేసిన దాని కంటే తాము అమారావతి పరిధిలో అభివృద్ధిని చూపించి ప్రజల్లోకి వెళ్లాలని అధికార పార్టీ భావిస్తోంది. మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్న ప్రభుత్వం..వచ్చే ఆరు నెలల కాలంలో అమరావతిలో కొత్త మార్క్ చూపించాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications