పేదలందరికీ ఇళ్లు పథకానికి బడ్జెట్ రిలీజ్: దశలవారీగా: 8 జిల్లాలకు: ఏ జిల్లాకు ఎంతంటే..?
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్లు పథకం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గరపడుతోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని వచ్చేనెల 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించబోతోంది. అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందజేయబోతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ పథకాన్ని జూలై 8వ తేదీన ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Recommended Video
దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది. తొలివిడతలో ఎనిమిది జిల్లాల కోసం బడ్జెట్ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 459.32 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. తొలిదశలో ఎనిమిది జిల్లాలకు బడ్జెట్‌ను విడుదల చేశారు. మిగిలిన అయిదు జిల్లాలకు మరోదఫాలో కేటాయిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, కడప జిల్లాలకు 50 కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్ కేటాయించారు.

కర్నూలు, నెల్లూరు జిల్లాలకు 80 కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్‌ను మంజూరు చేశారు. అనంతపురం-60, విశాఖపట్నం-39.32 కోట్ల రూపాయలను విడుదల చేశారు. మిగిలిన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు మరో దఫాలో బడ్జెట్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని పేదలందరికీ ఇళ్లు పథకానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని భూపరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది ప్రభుత్వం.
ఇప్పటికే ఈ పథకం రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. నిజానికి- ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఉగాది పండుగను పురస్కరించుకుని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని జగన్ సర్కార్ మొదట భావించింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా వేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు చేపట్టాలని భావించినా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల జులై 8వ తేదీకి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications