మద్యం అమ్మకాలు ఇక సీసీ కెమేరాల్లో - ధరలు ఇక.. ప్రభుత్వం తాజా ఉత్తర్వులు..!!
ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ప్రకటించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రం లో మద్యం పాలసీలో మార్పులు తెచ్చింది. పలు బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక, క్వార్టర్ రూ 99 విక్రయాలు జరిగాయి. అయితే, రెండేళ్ల కాలం పూర్తి కావటంతో ఇప్పుడు మద్యం షాపుల కేటాయింపు.. పాలసీలో మార్పుల పైనా నిర్ణయాలు తీసుకుంది. మద్యం దుకాణాలతో పాటుగా పర్మిట్ రూమ్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి చేసింది.
మద్యం షాపుల పైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మద్యం షాపులను మరో ఏడాది పాటు రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్టోబరు 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు లైసెన్సులు పొడిగిస్తూ 2026-27 పాలసీ మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,736 షాపుల లైసెన్స్‌లను రెన్యువల్ చేయనున్నారు. ఇందులో 340 గీత కులాలకు రిజర్వ్‌డ్ షాపులున్నాయి. రెన్యువల్ చేసుకునే లైసెన్సీలు లైసెన్స్ ఫీజులో 38 శాతం రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఆర్‌ఈటీ) చెల్లించాలి. 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 23 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు రూ. 27.2 లక్షలు, 5 లక్షలపైన జనాభా ఉన్న చోట్ల రూ. 35.5 లక్షలు రెన్యువల్ ఫీజులు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో
అయితే.. ఇది ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ షాపుల లైసెన్సీలు అందులో 50 శాతం చెల్లించాలి. లైసెన్స్ ఫీజు ఏడాదికి జనాభా ఆధారంగా వరుసగా రూ. 60.5 లక్షలు, రూ. 71.5 లక్షలు, రూ. 93.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాలుగు విడతల్లో చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు. కాగా.. పర్మిట్ రూమ్ ఫీజు 50వేల లోపు జనాభా ఉంటే రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.7.5 లక్షలుగా నిర్ణయించారు. ఈనెల 12 నుంచి 21 వరకు రెన్యువల్‌కు అవకాశం కల్పిస్తారు. రెన్యువల్ కాని షాపులకు 22 నుంచి 29 వరకు కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు. వీటి దరఖాస్తు రుసుము రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. 30న లాటరీ తీసి కొత్త లైసెన్సీలను ఎంపిక చేస్తారు. అక్టోబరు 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది.
ఇక.. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు జరిమానా భారీగా పెంచారు. తొలిసారి ఉల్లంఘనకు రూ.10 లక్షలు జరిమానా విధిస్తారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకం, బ్రాండ్ మిక్సింగ్ లేదా నీళ్లు కలపడం, అమ్మకాలపై ఈ-జాబితాలు నిర్వహించకపోయినా ఇదే జరిమానా వర్తిస్తుంది. రెండోసారి ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దుచేస్తారు. అన్ని షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. సీసీ టీవీల ఫీడ్‌ను ట్యాంపరింగ్ చేస్తే రూ. 50 వేలు జరిమానా విధిస్తారు. రెండోసారి చేస్తే రూ. లక్ష జరిమానా వేస్తారు. ఆ తర్వాతా ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దుచేస్తారు. ప్రతి షాపులోనూ డిజిటల్ చెల్లింపులు చేసే సౌకర్యం ఏర్పాటుచేయాలి. లైసెన్సీలకు బెల్టు షాపుల్లో భాగస్వామ్యం ఉంటే మొదటిసారి రూ. 5 లక్షలు జరిమానా విధిస్తారు. రెండోసారి ఉల్లంఘనకు లైసెన్స్ రద్దుచేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications
