ఏపీకి పవర్‌ఫుల్ ఐపీఎస్‌ను తీసుకురాబోతున్న చంద్రబాబు
రాష్ట్రానికి సమస్యాత్మకంగా మారిన డ్రగ్స్, గంజాయిని నియంత్రించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం సీఎం సమర్థుడైన అధికారి కోసం అన్వేషిస్తున్నారు. తాజాగా ఆయన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆకే రవికృష్ణను ఎంపిక చేసుకున్నారు. రవికృష్ణను రాష్ట్రానికి పంపించాలంటూ కేంద్రాన్ని కోరారు. చంద్రబాబు వినతిమేరకు రవికృష్ణను సొంత క్యాడర్‌కు పంపించే ప్రతిపాదనలకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వశాఖ (డీవోపీటీ) ఆమోదం తెలిపింది.
డిప్యుటేషన్ పై కేంద్రంలో..
కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై ఉన్న ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ రెండు రోజుల్లో రాష్ట్రానికి రాబోతున్నారు. డీవోపీటీ డైరెక్టర్ సాక్షి మిట్టల్ ఉత్తర్వులు జారీచేశారు. ఏపీలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తోంది. దీనికి అధిపతిగా రవికృష్ణ వ్యవహరించనున్నారు.

ఆయన 2006 బ్యాచ్ కు చెందిన ఐజీ క్యాడర్ అధికారి. గతంలో ఆయన చింతపల్లి, పార్వతీపురం, వనపర్తి ఏఎస్పీగా, కొత్తగూడెం ఓఎస్డీగా విధులు నిర్వహించారు. జిల్లాల విభజన జరగకముందు కర్నూలు, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా, తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు. 2018 నుంచి డిప్యుటేషన్ పై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధులు నిర్వహిస్తున్నారు.
ఏపీ సీఎంవోలోకి రాజమౌళి
ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏవీ రాజమౌళిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లోకి తీసుకోనుంది. ఏపీకి చెందిన రాజమౌళి 2003 బ్యాచ్ ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. మూడు సంవత్సరాలపాటు డిప్యుటేషన్ పై ఏపీలో కొనసాగేందుకు కేంద్రం రాజమౌళికి అనుమతి ఇచ్చింది. డీవోపీటీ డైరెక్టర్ సాక్షి మిట్టల్ ఉత్తర్వులు జారీచేశారు. 2015-19 మధ్య సీఎం సెక్రటరీగా సీఎంవోలో పనిచేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ హోంశాఖ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications