జగన్ విధేయ అధికారిపై వేటు - విచారణ..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఇసుక, లిక్కర్, ఫైబర్ నెట్ పైన కూటమి ప్రభుత్వం విచారణకు నిర్ణయించింది. జగన్ హయాంలో నాటి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టారు. లిక్కర్ వ్యవహారం పైన సీఐడీ విచారణకు ఆదేశించారు. ఇప్పుడు ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూధన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సస్పెండ్
ఏపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఫైబర్‌నెట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో భారీఎత్తున నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని, పలువురు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చారని తెలిపింది. అప్పట్లో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుత, మాజీ ఉద్యోగులను ఆయన ప్రభావితం చేస్తున్నట్లు వివరించింది.

అవినీతి
మధుసూధన్‌రెడ్డి ఏపీఎస్ఎఫ్ఎల్ రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని, సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని జీవోలో వెల్లడించింది. అలాగే కేంద్ర సర్వీసు నిబంధనలను ఆయన ఉల్లంఘించినట్టు స్పష్టం చేసింది. ఎండీగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగులుగా నియమించుకున్నారని తెలిపింది. ఆయన విచారణను ప్రభావితం చేయకుండా, సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అడ్డుకునేందుకే సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. మధసూదన్‌రెడ్డి అమరావతిని విడిచి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
విచారణ
మదుసూధన్ రెడ్డి 2008 ఐఆర్టీఎస్ అధికారి. ఆయన కేంద్ర సర్వీసు నిబంధనలను ఉల్లఘించారని ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ డిప్యుటేషన్ కొనసాగించాలని రైల్వే శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గత ఐదేళ్లలో ఆ సంస్థ కనెక్షన్ల సంఖ్య సగానికి తగ్గినట్లు లెక్కలు చూపి ఆ మేరకు వసూలైన నెల బిల్లుల మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ గా ఉన్న ఆయన.. ఈ విధంగా ప్రతీ నెలా రూ. 14 కోట్ల చొప్పున 17 నెలల్లో రూ. 238 కోట్ల సొమ్మును స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని పైన విచారణకు అదేశించనున్నారు.












Click it and Unblock the Notifications