ఉచిత బస్సు పథకంలో కీలక మార్పు - ఇక నుంచి అమలు ఇలా..!!
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ పథకం అమలు పైన ప్రభుత్వం నిరంతరం సమీక్ష చేస్తోంది. అవసరమైన సూచనలు అందిస్తోంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం కీలకంగా మారుతోంది. కాగా.. ఈ పతాకానికి పెరుగుతున్న ఆదరణ వేళ ప్రభుత్వం మరో నిర్ణయం అమలుకు సిద్దమైంది. దీని ద్వారా మహిళలకు మరింత ప్రయోజన కరంగా మారనుంది.
ఏపీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా స్త్రీ శక్తి పథకం అమల్లోకి తీసుకు వచ్చింది. అయితే, ప్రస్తుతం కేవలం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు కేటగిరీల బస్సులకే ఇది పరిమితం కావడంతో విపరీతమైన రద్దీ పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు త్వరలోనే ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు తాజాగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం వలన ఏపీలోని మహిళల ఆర్థిక సాధికారత పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. తొలి రోజు నుంచి 2026 ఆగస్టు నాటికి 87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయి. అంటే రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. 'స్త్రీ శక్తి' కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం రోజుకు సగటున రూ.8.53 కోట్ల సబ్సిడీ భరిస్తోంది.

ఇక ఏసీ బస్సుల్లోనూ అమలు
ఇప్పటి వరకు రూ.3,095 కోట్లు ఖర్చు చేసింది. 2026-27 బడ్జెట్‌లో కూడా ఈ పథకం కొనసాగింపు కోసం రూ.1,420 కోట్లు కేటాయించారు. ఆర్టీసీలో మొత్తం 9,978 బస్సులున్నాయి. వీటిలో 7, 631 బస్సుల్లో స్త్రీ శక్తి అమలు అవుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. స్త్రీ శక్తి ప్రారంభానికి ముందు ఆర్టీసీ ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతం మాత్రమే ఉంది. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత అది 62 శాతానికి పెరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 'దివ్యాంగశక్తి' పథకం ద్వారా 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని, వారి సహాయకులకు 50 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. అయితే, ఏసీ బస్సుల్లో కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందా లేదా అన్నదానిపై త్వరలో స్పష్టత రానుంది. కాగా.. ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దసరా నుంచి అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని పైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
