ఏపీలో ఇక రెండు రకాల పాఠశాలలు - టీచర్ల బదిలీపై నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యా వ్యవస్థలో సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్తగా వచ్చే ఏడాది నుంచి రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ సిద్దం చేస్తున్న ప్రభుత్వం త్వరలో అధికారిక నిర్ణయాలు ప్రకటించనుంది. అదే విధంగా పేరెంట్స్ కమిటీ తో భేటీ ..టీచర్ల బదిలీల పైన ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది.
మార్పుల దిశగ
ఏపీలో విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు రకాల ప్రాధమిక పాఠశాలలు నిర్వహించనుంది. బేసిక్ ప్రాథమిక పాఠశాల, ఆదర్శ పాఠశాలలుగా నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ సిద్దం చేస్తున్న అధికార యంత్రాంగం తాజాగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. తాజా ప్రతిపాదనల మేరకు బేసిక్ ప్రాధమిక పాఠశాలలో 20 మంది లోపు పిల్లల వరకు ఒక ఎస్జీటీని కేటాయించనుంది. అదే విధంగా 60 మంది పిల్లలు ఉంటే ఇద్దరు ఎస్జీటీలు ఉండేలా కసరత్తు చేస్తోంది.

కొత్త ప్రతిపాదనలు
అదే విధంగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఎస్జీటీని ఇవ్వనుండగా..120 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని నియమించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల విధానం పూర్తిగా రద్దు చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయానికి వచ్చారు. ఇక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల్లో 30మంది కంటే తక్కువ ఉంటే వాటిని ప్రాథమిక పాఠశాలలుగా గుర్తించనున్నారు. వాటిల్లో 60 కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలలుగా మార్చాలని నిర్ణయించారు. పదోన్నతులకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను మెరిట్ కం రోస్టర్ విధానంలోనే షెడ్యూల్ ప్రకారం ప్రమోషన్స్, బదిలీలు చేయాలని భావిస్తున్నారు.
బదిలీల ప్రక్రియ
ఉపాధ్యాయుల బదిలీ విధానంలోనూ కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రతీ ఏటా మే లో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇక నుంచి బదిలీల విషయంలో కేటగిరీల వారీగా సర్వీసును పరిగణలోకి తీసుకోనుంది. ప్రధానోపాధ్యాయులకు కనిష్టంగా రెండేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్లు, ఉపాధ్యాయులకు కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా 8ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకునేలా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. హెచ్‌ఆర్‌ఏ 16% ఉన్న వాటిని కేటగిరి-ఎ, 12% వాటిని కేటగిరి-బి, 10% ఉంటే కేటగిరి-సి, 5వేల కంటే జనాభా తక్కువగా ఉంటే కేటగిరి-డీగా ఖరారు చేయనున్నారు. ఏప్రిల్ 10 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications