ఎస్వీబీసీ ఛైర్మన్ గా సినీ ప్రముఖుడు- పవన్, బాలయ్య సిఫార్సు..!!
ఏపీలో కూటమి నేతలు పెండింగ్ పదవుల భర్తీ పైన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కూటమి లోని మూడు పార్టీల్లోని వారికి అవకాశం ఇస్తూ రెండు విడతలుగా పదవులు ప్రకటించారు. టీటీడీ బోర్డు ను నియమించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ అభ్యర్ధుల పైనా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయం లో ప్రతిష్ఠాత్మకమైన ఎస్వీబీసీ ఛైర్మన్ నియామకం పైన చర్చలు జరుగుతున్నాయి. సినీ ప్రముఖు డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్, బాలయ్య సైతం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
రేసులో ప్రముఖులు
కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత కీలక పదవుల ఖరారు పైన ఆసక్తి నెలకొంది. టీటీడీ బోర్డు పైన సుదీర్ఘ కసరత్తు తరువాత మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడుకు అప్పగించారు. ఇక, మూడు పార్టీలకు చెందిన వారికి టీటీడీ పాలక మండలిలో అవకాశం కల్పించారు. టీటీడీకి అనుబంధ విభాగమైన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తోంది. ఎస్వీబీసీ తో పాటుగా శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ (ఎస్‌విఇటిఎ) ఛైర్మన్ నియామకంపైనా ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల నుంచి ఈ పోస్టుల కోసం లాబీయింగ్ మొదలైంది.

కసరత్తు మొదలు
అదే విధంగా ఎస్వీబీసీ సీఈవో, సలహాదారు, చీఫ్ అడ్వైజర్ వంటి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వీటి పైన కసరత్తు మొదలైంది. గతంలో టీడీపీ హయాంలో ఎస్వీబీసీ ఛైర్మన్ గా ప్రముఖ దర్శకుడు రాఘవేద్రరావుకు అవకాశం దక్కింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సినీనటుడు పృధ్వీని ఆ స్థానంలో నియమించారు. కానీ, ఆయన పైన ఆరోపణలు రావటంతో తప్పించారు. ఆ తరువాత సాయికృష్ణ యాచేంద్ర ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక, ఇప్పుడు ఈ పదవి కోసం సినీ ప్రముఖులు మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్, నందమూరి బాలయ్య ద్వారా మరి కొందరు ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
పదవి దక్కేదెవరికి
అయితే, టీటీడీ ఛైర్మన్ పదవి దక్కించుకున్న సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు ఇవ్వాలనే ప్రతిపాదన పైనా చర్చ జరుగుతోంది. దీంతో, పవన్, బాలయ్య ద్వారా ఈ పదవి కోసం మరో ఇద్దరు సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఒక ప్రముఖుడి పేరు బాలయ్య సూచించినట్లు సమాచారం. అదే విధంగా పవన్ అభిప్రాయం సైతం తీసుకున్న తరువాత డిసెంబర్ తొలి వారంలో ఎస్వీబీసీ ఛైర్మన్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. అదే విధంగా శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ ఛైర్మన్ పదవి కోసం జనసేన తిరుపతి నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీంతో, సినీ ఇండస్ట్రీ నుంచి ఈ పదవి ఎవరు దక్కించు కుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications