ఏపీలోనూ హైకోర్టు జడ్డీల బదిలీ చిచ్చు-భగ్గుమన్న న్యాయవాదులు-బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతోంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల బదిలీపై న్యాయవాదులు నిరసనలు తెలుపుతుండగా.. ఇవాళ ఏపీ హైకోర్టులోనూ ఇద్దరు న్యాయమూర్తుల బదిలీపై లాయర్లు నిరసనలకు దిగారు. కొలీజియం నిర్ణయాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ హైకోర్టు జడ్డీల బదిలీ
ఏపీ హైకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి రమేష్ ను వేరే హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కొలీజియం నిర్ణయం ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. దేశవ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా ఈ రెండు బదిలీలు అయ్యాయి. కొలీజియం నిర్ణయాన్ని గౌరవిస్తూ వీరిద్దరూ ఆయా హైకోర్టుల్లో చేరాల్సి ఉంది.

లాయర్ల నిరసనలు
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దేవానంద్, జస్టిస్ డి రమేష్ బదిలీలకు నిరసనగా ఇవాళ హైకోర్టులో న్యాయవాదులు నిరసనలకు దిగారు. న్యాయమూర్తుల బదిలీలపై హైకోర్టు ముందు నిరసన చేపట్టారు. ఏపీ హైకోర్టులో న్యాయవాదుల బదిలీలో వివక్ష చూపారని వారు ఆరోపించారు. కొలీజియం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విధులు బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో హైకోర్టు కార్యకలాపాలపైనా ప్రభావం పడింది.

అందుకే బదిలీల అన్న లాయర్లు
గుజరాత్ లో న్యాయవాదుల ఆందోళనతో కొలీజియం ఇలాంటి బదిలీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని, ఇక్కడా అలాగే ఉపసంహరించుకోవాలని హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కోరారు. న్యాయమూర్తి బట్టు దేవానంద్ ఎంతటివారినైనా, ఐఐఎస్, ఐపీఎస్ అధికారులను కూడా కోర్టుకు పిలిపించి శిక్షలు వేశారని ఆయన గుర్తుచేశారు. ఐఏఎస్ లు , ఐపీఎస్ లను పిలిపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు, కొలీజియంకు తప్పుడు ఫిర్యాదులు ఇచ్చి వీరిని బదిలీ చేయించిందని ఆయన ఆరోపించారు. బదిలీలు చేయటం ద్వారా ఇతర జడ్జిలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

విధుల బహిష్కరణకు బార్ కౌన్సిల్ నిర్ణయం
ఏపీ హైకోర్టులో ఇద్దరు కీలక న్యాయమూర్తులు జస్టిస్ దేవానంద్, జస్టిస్ రమేష్ ల బదిలీలపై హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం నిర్ణయానికి నిరసనగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు విధులు బహిష్కరించాలని బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఏపీ బార్ కౌన్సిల్ నిరవధికంగా విధుల బహిష్కరణ నిర్ణయం తీసుకుందని న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. దీంతో రేపటి నుంచి హైకోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణలతో రోజువారీ కేసులపై ప్రభావం పడబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications