andhra pradesh high court AP Municipal Elections 2021 AP Local Body Elections 2021 nimmagadda ramesh kumar ban ap news ap govt హైకోర్టు నిషేధం ఏపీ ప్రభుత్వం
నిమ్మగడ్డకు హైకోర్టులో మరో షాక్- ఈ-వాచ్ యాప్ నిలిపివేత- అనుమతుల్లేవంటూ
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ యాప్‌పై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తిగా నిలిపివేస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో దీన్ని వాడేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఏపీలో ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ యాప్‌ను తీసుకొచ్చారు. అయితే దీనిపై వైసీపీ సర్కార్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమను టార్గెట్ చేసేందుకే నిమ్మగడ్డ ఈ యాప్ తీసుకొచ్చారని ఆరోపించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న నిఘా యాప్ వాడకుండా కొత్తగా ఈ-వాచ్ యాప్ తీసుకురావడాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టులో గతంలోనే దీన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

ఈ-వాచ్ యాప్‌పై ఇవాళ తుది విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం దీన్ని పూర్తిగా నిలిపిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ ఈ-వాచ్ యాప్‌కు సాంకేతిక అనుమతులు రాకపోవడం, కోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు ఎస్ఈసీ తరఫు న్యాయవాదులు సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో ఈ యాప్‌ను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుపై విచారణను కూడా ఇంతటితో ముగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అయితే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ-వాచ్ యాప్ వాడకంపై అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టుకు రావొచ్చని పిటిషనర్లకు తెలిపింది.