అమరావతి పాదయాత్రకు హైకోర్టు భరోసా-నేడు కీలక ఆదేశాలు-వైసీపీ అడ్డంకులకు చెక్ పెట్టేనా?
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అమరావతిలోనే రాజధాని కోరుతూ రైతులు అరసవిల్లికి చేపట్టిన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతివ్వకపోయినా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసీపీ సర్కార్ తమ పార్టీ నేతల సాయంతో దీనికి అడ్డంకులు కల్పిస్తోంది. పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రులు నేరుగా హెచ్చరికలు చేస్తుంటే, ఈ యాత్ర సాగే మార్గాల్లో నల్లబెలూన్లతో వైసీపీ నేతలు నిరసనలకు దిగుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది.

అమరావతి పాదయాత్రకు అడ్డంకులు
అమరావతి రైతులు ఒకే రాజధాని కోసం అరసవిల్లికి చేపట్టిన మహాపాదయాత్రకు అడ్డంకులు తప్పడం లేదు. మూడు రాజధానుల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, వైసీపీ నేతలు పాదయాత్ర ద్వారా ప్రజాభిప్రాయంలో మార్పు వస్తే ఇబ్బందులు తప్పవనే భావనలో కనిపిస్తున్నారు. దీంతో మంత్రులు నేరుగానే పాదయాత్రను అడ్డుకోవాలని హెచ్చరికలు చేస్తుంటే .. నేతలు నేరుగా రంగంలోకి దిగి నల్లబెలూన్లు ఎగరవేసి, రాళ్లు, బాటిళ్లతో దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాదయాత్ర చేస్తున్న రైతులు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో రైతుల పిటిషన్
రాజధాని కోసం రైతులుచేస్తున్న పాదయాత్రకు ప్రభుత్వం,అధికార వైసీపీ అడ్డంకులు కల్పిస్తోందని ఆరోపిస్తూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు అనుమతి ఉన్నా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు తప్పడంలేదని, పోలీసుల ఆంక్షలు దీనికి అదనంగా ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై తక్షణం జోక్యం చేసుకుని గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.

పాదయాత్రకు హైకోర్టు భరోసా
దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు ఈ వ్యవహారంపై నిన్న విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వీటిపై స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వ న్యాయవాదికి పలు ప్రశ్నలు వేసింది. వాస్తవ పరిస్దితులు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ వాదన తెలుసుకున్నాక పాదయాత్ర సజావుగా సాగేలా ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. దీంతో రైతులకు భారీ ఊరట దక్కినట్లయింది.

జగన్ సర్కార్ కు నేడు హైకోర్టు ఆదేశాలు..
అమరావతి పాదయాత్రకు స్వయంగా తాము అనుమతి ఇచ్చినా ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించడం, అధికార వైసీపీ నేతలు నల్లబెలూన్లతో నిరసనలకు దిగడం, నేరుగా రాజమండ్రి ఎంపీ ఆందోళనలో పాల్గొని రైతులపై బాటిళ్లు విసరడం వంటి ఘటనల్ని హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో ఇవాళ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా పోలీసులు పాదయాత్రకు పోటీగా జరుగుతున్న నిరసనలకు ఎలా అనుమతిస్తున్నారనే అంశంపై పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు దీనిపైనా ఆదేశాలు ఇవ్వబోతోంది.












Click it and Unblock the Notifications