62 ఏళ్ల పదవీ విరమణ వయసు పై హైకోర్టు కీలక తీర్పు..!!
62 ఏళ్ల పదవీ విరమణ వయసుపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తించవని హైకోర్టు తేల్చి చెప్పింది. కార్పొరేషన్లలో పనిచేసే పలువురు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
పదవీ విరమణ వయసుపై:ప్రభుత్వ కార్పోరేషన్లు..సొసైటీల్లో పని చేసేలా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు పైన హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పబ్లిక్ సర్వీస్ కింద నియమితులై, ప్రభుత్వ వ్యవహారాలతో నేరుగా సంబంధం ఉన్న ఉద్యోగులు, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి జీతాలు తీసుకునేవారికి మాత్రమే ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్-1984 వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమ పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఏపీ విద్యా సంక్షేమ మౌలికవసతుల అభివృద్ధి కార్పొరేషన్(ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఉద్యోగులు, మరికొన్ని కార్పొరేషన్ల ఉద్యోగులు గత ఏడాది వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు.

సింగిల్ జడ్జి తీర్పు కొట్టివేత:వీటిని కలిపి విచారించిన సింగిల్ జడ్జి.. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు పిటిషనర్లు అర్హులని గత ఏడాది సెప్టెంబరులో తీర్పు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి డిసెంబరులో అప్పీల్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయన్నారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ కొన్ని కార్పొరేషన్లు తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదని తెలిపారు.
హైకోర్టు కీలక నిర్ణయం:పిటీషనర్ల తరపు న్యాయవాదులు కార్పోరేషన్లలో పని చేసే ఉద్యోగులు ప్రభుత్వ నియంత్రణలో ఉండే విధులను నిర్వహిస్తారని అందువల్ల వారికి 62 ఏళ్లు వర్తిస్తుందన్నారు. కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల సర్వీస్ రూల్స్ రాజ్యాంగంలోని అధికరణ 309 కింద రూపొందించలేదని వివరించారు. వారికి ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఈ సర్వీస్ రూల్స్‌లో పేర్కొన్న అధీకృత అధికారి కార్పొరేషన్ ఉద్యోగులను నియమిస్తారని పేర్కొన్నారు. జీతాలు సైతం కార్పొరేషనే చెల్లిస్తుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వారి జీతాల చెల్లింపులు జరగవని వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్-1984 ద్వారా సంక్రమించే ప్రయోజనాలు పొందేందుకు కార్పొరేషన్ ఉద్యోగులు అనర్హులుని ధర్మాసనం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications