కాపు రిజర్వేషన్ల కేసు- ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం-సర్కార్ కు ఆదేశాలు..!
అమరావతి : ఏపీలో కాపు రిజర్వేషన్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్.. కాపు రిజర్వేషన్లు కల్పించేందుకు ముందుకు రాకపోవడంతో మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఆలాగే ఇదే అంశంపై మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిపై ఇవాళ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది.
ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లలో హరిరామజోగయ్య పిటిషన్ తో పాటు మిగతా వాటిని కూడా తదుపరి విచారణలో కలిపి విచారించాలని హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో వాటిపై కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.

రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లు అమలు చేయకపోవడానికి వైసీపీ సర్కార్ పలు కారణాలు చెబుతూ వచ్చింది. తొలుత కేంద్రం చేతుల్లో ఈ అంశం ఉందని చెప్పిన ప్రభుత్వం.. అనంతరం కేంద్రం క్లారిటీ ఇచ్చేయడంతో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని చెప్పింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు కూడా తేలిపోయినా.. రిజర్వేషన్లు మాత్రం కల్పించడం లేదని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications