చంద్రబాబు బెయిల్ పిటీషన్లపై తేల్చనున్న హైకోర్ట్..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్లు నేడు ఏపీ హైకోర్టు సమక్షానికి రానున్నాయి. వేర్వేరు కేసుల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. వాటన్నింట్లో తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పిటీషన్లు దాఖలు చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఇదివరకే ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 53 రోజుల పాటు విచారణను ఎదుర్కొన్న చంద్రబాబు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదల అయ్యారు. అనంతరం ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.

మరో రెండు కేసుల్లో విచారణను ఎదుర్కొనాల్సి ఉంది చంద్రబాబుకు. 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక పాలసీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. దీనిపై కేసులు నమోదయ్యాయి. అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసూ ఆయనపై నమోదైంది.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ అధికారులు ఇదివరకే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి పొంగూరు నారాయణ భార్య రమాదేవి పేరును చేర్చారు. ఆమె బంధువు రాపూరి సాంబశివరావు, నారాయణ కాలేజీ ఉద్యోగి ధనుంజయ్ భార్య ప్రమీల, నారాయణ బంధువు ఆవుల మణిశంకర్ పేర్లను చేరుస్తూ సీఐడీ అధికారులు పిటీషన్ వేశారు.
ఆయా కేసుల్లో పోలీసులు, సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇదివరకు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మధ్యాహ్నం భోజన విరామం అనంతరం అవి విచారణకు రానున్నాయి.












Click it and Unblock the Notifications