జగన్ సర్కార్ పై ఉద్యోగుల పోరు మొదలు- ఏపీ జేఏసీ అమరావతి కార్యాచరణ ప్రకటన..
ఏపీలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఏపీ జేఏసీ అమరావతి ఇవాళ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది.
ఏపీలో ఉద్యోగులు మరో పోరుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి సమాధానంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు 50 పేజీల వినతి పత్రం ఇచ్చామని ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగులు చట్టబద్ధంగా దాచుకున్న డబ్బును ప్రభుత్వం వాడుకుందని ఆయన ఆరోపించారు.న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు సకాలంలో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను చులకనగా చూస్తోందని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు ఆరోపించారు. తమ సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారన్నారు. తమ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని, సీఎం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదన్నారు. ఆర్థికపరమైన అంశాలన్నీ పరిష్కరించాలని సీఎంను కోరామని, తమ సమస్యలపై మంత్రుల బృందం చర్చలన్నీ చాయ్-బిస్కెట్ చర్చలేనన్నారు. ఆలస్యమైనా మాకు మేలు చేస్తారని ఇన్నాళ్లూ చూశామని,
ఇక మాకేమీ చేయరని తెలిసిందన్నారు. అందుకే ఉద్యమంలోకి దిగుతున్నామన్నారు. తమ ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వమే కారణమన్నారు.

మార్చి 9, 10న నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపడతామని, మార్చి 13, 14న కలెక్టరేట్లు, ఆర్‌డీవో కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్న భోజన విరామ వేళ ఆందోళన నిర్వహిస్తామన్నారు. 15, 17, 20న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు ఉంటాయన్నారు. మార్చి 21 నుంచి వర్క్ టు రూల్, సెల్‌ఫోన్ డౌన్ చేస్తామని,
మార్చి 24న హెచ్‌వోడీల వద్ద ధర్నాలు చేస్తామని బొప్పరాజు తెలిపారు. మార్చి 27న కరోనా మృతుల కుటుంబాలను కలుస్తామన్నారు.
ఏప్రిల్ 1న ఉద్యోగులకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు ఉంటాయని, ఏప్రిల్ 3న ప్రతి జిల్లాలో చలో స్పందన, అధికారులకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. ఏప్రిల్ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తామని, మా డిమాండ్లు పరిష్కరించకుంటే రెండోదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులపై ప్రజలు కూడా సానుభూతి చూపిస్తున్నారని బొప్పరాజు తెలిపారు. 20వ తేదీ దాటీనా జీతాలు వేయడం లేదని, జీతాలు సరిగా ఇవ్వక ప్రభుత్వ ఉద్యోగులు చులకనగా తయారయ్యారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల్లో భాగమేనని బొప్పరాజు గుర్తుచేశారు. తమకు సహకరించాలని ప్రజాసంఘాలు, కార్మికసంఘాలను ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications