Chalo Vijaywada: ఏపీ సర్కార్ పై ఉద్యోగుల ఫైర్- 27న ఛలో విజయవాడకు పిలుపు..!
ఏపీలో ఉద్యోగుల సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఇవాళ ఏపీ ఎన్జీవోలు భగ్గుమన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి గౌరవం లేదని, గతంలో అంగీకరించిన తమ డిమాండ్ల విషయంలో అతీ గతీ లేదని ఫైర్ అయ్యారు. గతంలో నిర్వహించిన 11 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఛాయ్ బిస్కట్లకే పరిమితం అయ్యాయన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మడం సడలిందని, అందుకే 27న ఛలో విజయవాడకు సిద్దమవుతున్నట్లు ప్రకటించారు.
తమ సంస్ధలో పనిచేసే ఉద్యోగుల పట్ల యాజమాన్యానికి కనీస గౌరవం ఉంటుందని, కానీ ఉద్యోగుల విషయంలో కనీస గౌరవం, మానవత్వం లేకుండా వ్యవహరించిన ప్రభుత్వాన్ని తన 43 ఏళ్ల కెరీర్ లో చూడలేదని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ విమర్శించారు. జేఏసీ పిలుపులో భాగంగా ఈ నెల 14 నుంచి నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా విజయవాడలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగులతో చర్చల్లో ప్రభుత్వం అందమైన అబద్ధాలతో మోసం చేసిందన్నారు.

12వ పీఆర్సీ ఏర్పాటుపై ప్రకటన చేసినా ఇంతవరకూ కమిషన్ కు కనీసం కార్యాలయ గది కూడా కేటాయించలేదని బండి గుర్తుచేశారు. అందుకే తాము నిరసన బాట పట్టామన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకం ఉద్యోగులలో క్రమక్రమంగా సడలిపోతోందన్నారు. గతంలో ప్రభుత్వమే అంగీకరించిన డిమాండ్లపై ఇప్పటివరకు అతీగతీ లేదన్నారు.ఇప్పటివరకు ప్రభుత్వం వాయిదాలతోనే కాలం గడిపింది తప్ప ఒక్క సమస్యను కూడా సంతృప్తికర స్థాయిలో పరిష్కరించలేదన్నారు. తాము కూడా ఇప్పటివరకు ప్రభుత్వం విధించిన గడువులను గౌరవించామన్నారు.
ఉద్యోగులు తమ కార్యాలయాల్లో స్టేషనరీ ఖర్చులు కూడా భరిస్తున్నారన్నారని, ఇలాంటి దుర్గతి మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉద్యోగులు పోరాడి సాధించుకున్న చట్టపరమైన ప్రయోజనాలను కూడా ఈ ప్రభుత్వం కుదించిందన్నారు.గత ప్రభుత్వాల హయాంలో ఒకట్రెండు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగేవని, కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం 11 సమావేశాలు జరిగాయని, దానికి మాత్రం ప్రభుత్వాన్ని అభినందించాలన్నారు. కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారం లేని చాయ్ బిస్కెట్ సమావేశాలుగానే అవి మిగిలిపోయాయన్నారు.

తాము ఉద్యమానికి సిద్ధమని ప్రకటించిన ప్రతిసారి ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అంటూ హడావిడి చేయడం మినహా ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏమీ ప్రయోజనం చేకూర్చలేదన్నారు. ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడకు ముందే తమ అపరిష్కృత సమస్యలకు ఉద్యోగుల సంతృప్తి మేరకు పరిష్కారం కాకపోతే ఈ మహా ఆందోళన ద్వారా ప్రభుత్వానికి ఒక గట్టి సమాధానం ఇవ్వాలని ఉద్యోగులకు బండి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications