పీఆర్సీ ఇచ్చేస్తున్నాం- ఇక ఐఆర్ ఎందుకు ?- ఉద్యోగ నేతలతో మంత్రుల కమిటీ..
ఏపీలో ఎన్నికల వేళ ఉద్యోగులు తమ సమస్యలపై గళం విప్పుతున్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 27న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటన చేస్తామంటూ లీకులు కూడా ఇచ్చారు. చివరకు ఉద్యోగులకు కొత్తగా ఏమీ చెప్పకుండానే జూలై 31 నాటికి పీఆర్సీ ఇచ్చేస్తామని చెప్పి పంపేశారు.
ఈ నేపథ్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో మంత్రులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అక్కడ ఏం జరిగిందో చెప్పేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాల తో మంత్రుల కమిటీ చర్చలు ఫలవంతం కాలేదని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయం ప్రకారం పీఆర్సీ నీ నియమించినప్పుడు మధ్యంతర భృతి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ , గత పీఆర్సీ బకాయిలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లింపులు పై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పిందన్నారు.

వాస్తవానికి పీఆర్సీ బకాయిలే రూ.14,800 కోట్లు ఇవ్వాల్సి ఉందని బొప్పరాజు వెల్లడించారు. వీటిని ఎప్పుడు చెల్లించేది చెబుతామని గత సమావేశంలో చెప్పారన్నారు. మధ్యంతర భృతి ప్రకటనకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని, ఈ ప్రభుత్వం రివర్సు పీఆర్సీ ఇచ్చిందన్నారు. 12వ పీఆర్సీనీ జూలై 31 లోపే సెటిల్ చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందని ఆయన తెలిపారు. అందుకే మధ్యంతర భృతి ప్రకటించడం లేదని చెప్పారన్నారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపారన్నారు.
ఉద్యోగుల డిమాండ్ ల పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పిందని బొప్పరాజు వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దకరణకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందన్నారు. 10 వేల మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1300 మందిని మాత్రమే చేశారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 27న ఛలో విజయవాడ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications