చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ కీలక ప్రకటన..!!
తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం జైళ్ల అధికారులు స్పష్టత ఇచ్చారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు రాజమండ్రి జైలులో 32 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. తాజాగా చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురైనట్లు వార్తలు వచ్చాయి. దీని పైన వివరణ ఇచ్చిన అధికారులు చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసారు. చంద్రబాబుకి కోర్టు గైడెన్స్ ప్రకారం సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రోజుకి మూడు సార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
ఆరోగ్యంగా చంద్రబాబు : చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురైనట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని కోస్తాంధ్ర జైళ్ల శాఖ డిఐజి కిరణ్ తెలిపారు. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు. అయితే ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని.. వేడి, ఉక్కబోత ఎక్కువగా ఉన్నాయని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారనే వార్తలు వచ్చాయి. గతచంద్రబాబును ములాకత్‌లో కలిసిన కుటుంబసభ్యులకు ఆ విషయాలను చెప్పినట్టు.. దీంతో వారిలో ఆందోళన మొదలైనట్టు సమాచారమంటూ వార్తలు వచ్చాయి. దీంతో, ఈ వార్తలపై కోస్తాంధ్ర జైళ్ల శాఖ డిఐజి కిరణ్ స్పందించారు.

అధికారులు వివరణ : కోస్తాంధ్ర జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్ మాట్లాడుతూ ... చంద్రబాబు డీహైడ్రేషన్ కి గురైనట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఇబ్బంది ఉంటే కచ్చితంగా తనకు సమాచారం వస్తుందన్నారు. చంద్రబాబు డీహైడ్రేషన్ కి గురైనట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబుకి కోర్టు గైడెన్స్ ప్రకారం సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రోజుకి మూడు సార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తనకు అనారోగ్యంగా ఉన్నట్లు కూడా చంద్రబాబు చెప్పలేదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం తమ పని తాము చేస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. రేపటి నుంచి నాలుగు రోజులపాటు సెలవు పై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ వెళ్లనున్నారు.
న్యాయస్థానాల్లో విచారణ : దీంతో, రాహుల్ స్థానంలో ఇంఛార్జి సూపరింటెండెంట్‌గా డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్‌కి బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగించారని తెలిపారు. ఇక చంద్రబాబు క్వాష్ పిటీషన్ ఈ నెల 13న సుప్రీంలో విచారణకు రానుంది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. అటు హైకోర్టులో ఇతర కేసుల్లో ముందస్తు బెయిల్ పిటీషన్ల పైన విచారణ జరుగుతోంది. క్వాష్ పైన సుప్రీంలో నిర్ణయం వచ్చిన తరువాత బెయిల్ పైన చంద్రబాబు న్యాయవాదులు ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications