సెలవులు రద్దు.. ఎమర్జెన్సీ వైద్య సేవలు బంద్! జూనియర్ డాక్టర్ల సమ్మె సెగ
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. స్టైపెండ్ పెంపుతో పాటు పదవీ విరమణ వయసు పరిమితి, ఎన్‌ఎమ్‌సీ నిబంధనల ప్రకారం రిక్రూట్‌మెంట్లపై ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ లేవనెత్తిన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి లిఖితపూర్వక హామీ రాకపోవడంతో జూడాలు సమ్మెకు దిగారు.
వారం రోజులుగా దశలవారీగా నిరసనలు తెలిపినప్పటికీ సర్కార్ నుంచి స్పందన కరువవడంతో, సోమవారం ఉదయం నుంచి క్యాజువాల్టీ, ఐసీయూ, ఆపరేషన్లు సహా అన్ని రకాల అత్యవసర సేవలను బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. ఫలితంగా సర్కారీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రత్యామ్నాయ వ్యూహం.. సీనియర్లు, ప్రైవేటు వైద్యులకు పిలుపు!
జూనియర్ డాక్టర్ల సమ్మెతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ , డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.. తక్షణ ఆదేశాలు జారీ చేశారు. డీఎస్‌హెచ్ పరిధిలోని సీనియర్ రెసిడెంట్లు, డీఆర్‌పీలను వెంటనే రిలీవ్ చేసి మెడికల్ కాలేజీలకు రిపోర్ట్ చేయాలని సూచించారు. సెలవుల్లో ఉన్న వైద్యులను వెంటనే రప్పించడంతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, స్థానిక ఐఎంఏకు చెందిన డాక్టర్లను అత్యవసర సేవల కోసం డిప్యూటేషన్‌పై రీ-అసైన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనవసర రిఫరల్స్‌కు చెక్.. పీహెచ్‌సీల వైద్యాధికారులకు డ్యూటీలు!
రోగుల భారాన్ని తట్టుకునేందుకు వీలుగా 108 అంబులెన్స్ ట్రయాజ్ ప్రొటోకాల్ ఆధారంగా ప్రాథమిక కేసులను డీఎస్‌హెచ్ ఆస్పత్రుల్లోనే ఉంచి, కేవలం తీవ్రమైన కేటగిరీ-బీ కేసులను మాత్రమే బోధనాస్పత్రులకు రిఫర్ చేయాలని ఆదేశించారు. పిడియాట్రిక్స్, గైనిక్, అనస్థీషియా వంటి కీలక విభాగాల్లో ఇబ్బంది లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని రెండో వైద్యాధికారుల సేవలను ఆస్పత్రులకు మళ్లించారు. అంతేకాకుండా, డాక్టర్ల సాధారణ సెలవులను రద్దు చేస్తూ పీపీపీ విధానంలో నడిచే సేవలు, షిఫ్ట్ విధులు సజావుగా సాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎలెక్టివ్ ఆపరేషన్లపై సమీక్ష.. నిరంతర నిఘా!
జూడాల సమ్మె ముగిసే వరకు అత్యవసర శస్త్రచికిత్సలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ, సాధారణ ఎలెక్టివ్ ఆపరేషన్లను తాత్కాలికంగా సమీక్షించి వాయిదా వేయాల్సిందిగా వైద్య పరిపాలన విభాగం సూచించింది. ఆక్సిజన్, అత్యవసర మందులు, రక్తం, వెంటిలేటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూనే, ఆస్పత్రుల వారీగా బెడ్స్ లభ్యత, హాజరు నివేదికలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం శ్రమిస్తున్నప్పటికీ, సమ్మె సత్వరమే ముగియకపోతే సామాన్య రోగులకు ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.














Click it and Unblock the Notifications