ఏపీకి మళ్లీ టోపీ - సీఎం జగన్ సత్తాకు సవాల్ : రాష్ట్ర ప్రస్తావనే లేదు - పోలవరం ఏం చేస్తారు..!!
కేంద్ర బడ్జెట్ లో ఏపీ ప్రస్తావనే లేదు. కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నా... ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నా.. పొరపాటున కూడా బడ్జెట్ ప్రసంగంలో ఏపీ పేరే వినిపించ లేదు. మరో సారి ఏపీకి కేంద్రం టోపీ పెట్టింది. ఆర్దికంగా కష్టాల ఊబిలో చిక్కుకున్న ఏపీ పైన అదే నిర్లక్ష్యాన్ని కంటిన్యూ చేసింది. కనీస కనికరం చూపలేదు. ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రధానిని కలిసి విన్నివించినా... దక్షాణాది రాష్ట్రాల సదస్సులో ఏకరువు పెట్టినా..అవన్నీ ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదు. అరకొర కేటాయింపులు, మొక్కుబడి విదిలింపులూ తప్ప... ఒరిగిందేమీ లేదు. గతేడాది బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకంగా కేటాయించిన కొత్త ప్రాజెక్టు ప్రస్తావనలేదు.
Recommended Video

ఏపీకి మళ్లీ దగా... అదే కంటిన్యూ
విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల గురించిగానీ, రాష్ట్రంలోని విమానాశ్రయాలకు.. అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చేలా చర్యలు తీసుకుంటామనిగానీ... పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రాజెక్టుల్ని ఏపీలో ఏర్పాటు చేస్తామనే హామీ కానీ..చర్యలు గానీ ఎక్కడా బడ్జెట్ లో పేర్కొనలేదు. ఏపీకి జీవనాడి.. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కు నిధుల కేటాయింపు ప్రస్తావించ లేదు.
నాబార్డు ద్వారా నిధులు ఇస్తామని చెప్పినా..సవరించిన అంచనాల గురించి మూడేళ్లుగా ప్రదిక్షణలు చేస్తున్నా..దాని పైన స్పష్టత రాలేదు. విభజన చట్టం ప్రకారం పూర్తిగా తనే నిధులు ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును సైతం నిర్లక్ష్యం చేసింది. జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది.

అన్ని రంగాల్లోనూ నిరాశ
మొక్కుబడిగా సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చి.. తక్కిన సంస్థలకు ఎలాంటి కేటాయింపులు చేయక నిరాశపరిచింది. గతంలో ఆయా సంస్థలకు కనీసం లక్షల్లో అయినా కేటాయింపులు చూపేది. కానీ, ఈ సారి వాటి పైన స్పష్టత లేదు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై ఈ ఏడాది కూడా ముఖం చాటేసింది.
కేంద్ర జల్ శక్తి శాఖకు బడ్జెట్‌లో కేటాయించిన రూ.18,967.88 కోట్లలో భారీ నీటి పారుదలకు రూ.1,400 కోట్లు.. భారీ, మధ్యతరహా నీటి పారుదలకు రూ.6,922.81 కోట్లు వెరసి రూ.8,322.81 కోట్లు కేటాయించింది. ఇందులో నుంచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాబార్డు నుంచి రుణం తీసుకుని.. పోలవరానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

కేంద్ర ప్రాజెక్టులకు నిధులు ఏవీ
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలోని జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా పెట్రోలియం, సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చింది. తక్కిన ఏ సంస్థకూ ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. కనీసం గతంలో లక్షో, రెండు లక్షలో కేటాయింపులు చూపేది. ఈసారి బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించ లేదు.
రాష్ట్ర విభజన చట్టం కింద ఏపీలో 7 జాతీయ విద్యా సంస్థలతో పాటు మరో 9 సంస్థలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఆయా సంస్థల పురోగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. బడ్జెట్‌లో సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీ తప్ప ఇతర విద్యా సంస్థలు, విద్యేతర సంస్థలకు సంబంధించిన ప్రస్తావనే లేదు.

సీఎం జగన్ పైన రాజకీయ ఒత్తిడి
విభజన చట్టం కింద రాష్ట్రంలో సెంట్రల్ వర్సిటీ అనంతపురంలో ఏర్పాటు కాగా, గిరిజన వర్సిటీ విజయనగరం జిల్లా సాలూరులో ఇంకా ఏర్పాటు కావలసి ఉంది. దీని పైన అధికార వైసీపీ ఎంపీలు.. ఏపీ ఆర్దిక మంత్రి కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రతీ ఏటా చేసే వ్యాఖ్యలు మాదిరిగానే ఇవి కనిపించాయి. కానీ, ఏపీ నుంచి వైసీపీకి 22 మంది ..టీడీపీ నుంచి ముగ్గురు ఉన్నారు.
రాజకీయ అంశాలతో రెండు పార్టీల నేతలు కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి లేదు. ప్రతీ బడ్జెట్ లో ఏపీకి ఇదే విధంగా కొనసాగుతున్నా.. నిలదీసిన సందర్భాలు లేవు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పైన రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి నిధుల కోసం తిప్పలు పడుతోంది.

వైసీపీ ప్రభుత్వం ఏం చేయనుంది
దీంతో..ఢిల్లీలోనే ఉంటూ మంత్రి బుగ్గన..అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బడ్జెట్ లో ఆర్దిక అంశాలు ప్రస్తావన.. వెనుక బడిన జిల్లాలకు నిధులు.. రెవిన్యూ లోటు భర్తీ విషయంలో కేంద్రం దాటవేత వైఖరితో ఉన్నా.. ప్రశ్నించలేని పరిస్థితిలో ఏపీ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు సీఎం ఏం చేయబోతున్నారు.
రాజకీయంగా ప్రతీ అంశానికి కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నా... కేంద్రం నుంచి మాత్రం ఏపీకి ఏ మాత్రం తోడ్పాటు అందటం లేదు. దీంతో..ఈ పరిస్థితులు సీఎం జగన్ సత్తాకు సవాల్ గా మారుతున్నాయి. బడ్జెట్ పైన ఆయన నేరుగా స్పందిస్తారా.. ఏపీకి అన్యాయం పైన నిలదీస్తారా.. కేంద్రంతో ఎలా వ్యవహరించబోతున్నారు...ఇప్పుడు రాజకీయంగా ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications