కృష్ణాబోర్డుకు పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ కోసం ఏపీ లేఖ: ఈ పంచాయితీలు తెగేలా లేవుగా!!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటుచేసుకుంటున్న జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారం కావడం లేదు. పంచాయితీలు తెగటం లేదు. తరచూ ఒక రాష్ట్రం పై మరొక రాష్ట్రం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ
ఇటు కృష్ణానది జలాల పైనే కాకుండా గోదావరి నది గల పైన కూడా ఇరు రాష్ట్రాల మధ్య అనేక అభ్యంతరాలు కనిపిస్తున్నాయి. వరుస ఫిర్యాదులతో రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడాలను జటిలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈ ఎన్ సి నారాయణ రెడ్డి లేఖ రాశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని లేఖలో కోరారు.

విభజన చట్టానికి వ్యతిరేకంగా పాలమూరు రంగారెడ్డి నిర్మాణం
విభజన చట్టానికి వ్యతిరేకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆక్షేపిస్తోంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన డిపిఆర్ ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ కొత్త ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదని ఏపీ తన లేఖలో స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అనుమతి లేని ప్రాజెక్టులపై కెఆర్ఎంబి కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

తెలంగాణా ఇచ్చిన డీపీఆర్ కాపీ ఇవ్వాలని ఏపీ విజ్ఞప్తి
ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు డిపిఆర్ ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాలలో తెలంగాణ ఈ విషయాన్ని ప్రస్తావించిందని లేఖలో ఏపీ పేర్కొంది. కాబట్టి ఈ ప్రాజెక్టుపైన తమ అభ్యంతరాలు చెప్పడం కోసం తమకు డిపిఆర్ కాపీ ఇవ్వాలని కేఆర్ఎంబీని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తోంది అని తెలంగాణపై ఏపీ ఆరోపించింది. మరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీకి తెలంగాణా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై డీపీఆర్ ఇస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications