Live Video: విడదల రజనిని కింద పడేసిన ఎస్సై.. చిలకలూరిపేటలో హైటన్షన్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు రణరంగంగా మారాయి. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలు, దాడులతో పల్లెలు, పట్టణాలు అట్టుడుకుతున్నాయి. ఈ క్రమంలోనే శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ ముఖ్య నేతలను, అభ్యర్థులను ఇళ్లకే పరిమితం చేస్తూ 'హౌస్ అరెస్ట్'ల పర్వానికి తెరలేపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లతో పాటు మున్సిపల్ ప్రచారంలో పాల్గొనకుండా ముందస్తు ఆంక్షలు విధించడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఉద్రిక్తతల నడుమ పల్నాడు జిల్లా చిలకలూరిపేట వేదికగా పొలిటికల్ డ్రామా పరాకాష్టకు చేరింది. తన నివాసం నుంచి బయటకు వస్తున్న మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినిని, అలాగే యడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థిని చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంక అడ్డుకున్నారు. నామినేషన్‌కు భీఫామ్ అందజేయాల్సి ఉందని, ఎందుకు అడ్డుకుంటున్నారని రజిని ముందుకు వెళ్లేందుకు యత్నించగా, మహిళా ఎస్సై గట్టిగా నెట్టివేయడంతో రజిని ఒక్కసారిగా కిందపడిపోయారు. తన నివాసానికే వస్తున్న సొంత మనుషులను సైతం రానివ్వకుండా అడ్డుకోవడమేంటని ప్రశ్నించిన రజినిపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది.

"పిచ్చి పట్టిందా.. చంపుతావా?": పోలీసుల తీరుపై భగ్గుమన్న రజిని
తనపై జరిగిన తోపులాట, పోలీసుల తీరుపై విడదల రజిని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదునైన అంచు ఉన్న బండపైకి తోసేసేందుకు యత్నించారని ఆరోపిస్తూ ఎస్సై ప్రియాంకపై ఆగ్రహంతో ఊగిపోయారు. "ఎవరు పంపించారు నిన్ను ఇక్కడికి? పిచ్చి పట్టిందా నీకు? చంపుతావా మమ్మల్ని? గత మూడు రోజుల నుంచి బయటకు రానివ్వడం లేదు.. ఏం మెంటలా నీకు? ఎవడు పంపించాడు నిన్ను? ఎక్కువ చేస్తున్నావ్.. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. అసలు ఆడదానివేనా? ఏం మనిషివి నువ్వు? మా నాయకుడిని ఆపడానికి నువ్వు ఎవరు? నేను బి-ఫామ్ ఇవ్వాలి, ఆయన్ను లోపలికి రమ్మను" అంటూ నిప్పులు చెరిగారు.
ఒక మాజీ మంత్రి అని కూడా చూడకుండా, సొంత ఇంటి వద్దే పోలీసులు ఇలా ప్రవర్తించడం వెనుక స్థానికంగా కూటమి పెద్దల హస్తం ఉందంటూ స్థానిక వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో చిలకలూరిపేటలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.













Click it and Unblock the Notifications
