నాని! అది ఎలా అవమానం? మీకేం తెలుసు?: మంత్రి బొత్స, నిర్మాత నట్టి కుమార్ కౌంటర్
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల రేట్ల వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీలోని పలువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. సినిమా టికెట్ల ధరలను తగ్గించి సినిమాను చూసేవారిని అవమానిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ, సినీ నిర్మాత నట్టి కుమార్ కౌంటర్ ఇచ్చారు.

నానికి సినిమా కలెక్షన్ల గురించి ఏం తెలుసు?: నట్టి కుమార్
నాని వ్యాఖ్యలపై నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ.. నానికి సినిమా కలెక్షన్ల గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలపై ఆలోచించి మాట్లాడాలన్నారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని కోరారు. కాగా, ఈ వివాదాలతో సినిమా ఇండస్ట్రీ రెండుగా చీలే అవకాశం ఉంది. ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వర్గం ఒకటి, ప్రభుత్వం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వర్గం ఒకటి. ఇప్పటికే ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీ ప్రభుత్వ విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏదేమైనా రేపు మరోసారి కోర్టులో విచారణకు రానున్న ఈ వివాదంపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సినిమా టికెట్లు ధరలు తగ్గించడం అవమానమా?: నానికి బొత్స కౌటర్
మరోవైపు, నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుడికి సినిమా అందుబాలో ఉండాలనే టికెట్ ధరలు తగ్గించామని బొత్స అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని, తమకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మార్కెట్‌లో ఏదైనా కొంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా? అని ఆయన అన్నారు. ప్రేక్షకులను మేమెందుకు అవమానిస్తామని, టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా..? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మేమింతే.. ఎంతంటే అంత వసూలు చేస్తామంటే కుదరదని మంత్రి బొత్స తేల్చి చెప్పారు. సినిమా చూసేవారికి మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వ తీరుపై టాలీవుడ్ హీరో నాని అసంతృప్తి
కాగా, నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్యామ్‌సింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 'ఏపీలో టిక్కెట్ల విషయమై ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు... మీరు ప్రేక్షకులను అవమానిస్తున్నారు... ఈ పాలిటిక్స్ ను, సినిమాలను అన్నింటినీ పక్కన పెడితే ఇలా చేయడం ప్రేక్షకులను అవమానించినట్టే'అని నాని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ చూస్తున్న టికెట్ రేట్స్ రూ.10, రూ.15, రూ. 20 అని... మళ్ళీ ఇది అనవసరంగా ఏ థంబ్ నెయిల్స్ పెడతారో... రేపు అసలు సినిమా రిలీజ్ కూడా ఉంది... 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి థియేటర్లు నడుపుతున్న ఒక వ్యక్తి కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉంటే కరెక్ట్ కాదు... నా చిన్నప్పుడు స్కూల్లో అందరం పిక్నిక్ కు వెళ్లేవాళ్లం... ఆ టైంలో అందరి దగ్గరా రూ.100 అడిగేవారు. అయితే అదే సమయంలో అందరూ రూ.100 ఇవ్వగలరు... నాని నువ్వు మాత్రం ఇవ్వలేవు... నువ్వు రూ. 10 ఇస్తే చాలు అంటే అది నన్ను ఇన్సల్ట్ చేసినట్టే..." అని నాని ఏపీలో సినిమా రేట్ల తగ్గింపును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సినిమా టికెట్లు పెంచినా ప్రేక్షకులు చూస్తారన్నారు.












Click it and Unblock the Notifications