ఏపీ మంత్రికి ఐటీ నోటీసులు: అది బినామీ ఎలా అవుతుందన్న జయరాం
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, ఆయన భార్య రేణుకమ్మతోపాటు, ఆలూరు సబ్ రిజిస్ట్రార్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

30 ఎకరాల భూమిని ఏపీ మంత్రి బినామీగా కొన్నారన్న ఐటీ
జయరాం సతీమణి రేణుకమ్మ పేరుతో ఆస్పరి మండలం చిన్నహోతురు, ఆస్పరిలో 30.83 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి ఐటీ శాఖ అక్టోబర్ 30న మంత్రి జయరాం, రేణుకమ్మ, ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కు నోటీసులు జారీ చేసింది. ఈ భూమి కొనుగోలు చేసేందుకు మంత్రి జయరాం డబ్బులు చెల్లించారని ఐటీ అధికారులు నోటీసులు పేర్కొన్నారు. 30.83 ఎకరాల భూమికి రూ. 52.42 లక్షలు చెల్లించారని, దీన్ని బినామీగా పేర్కొన్నారు.

తమపై బురజల్లేందుకే దుష్ప్రచారమన్న జయరాం
కాగా, నోటీసులు అందుకున్న 90 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఐటీ శాఖ అధికారులు అందులో పేర్కొన్నారు. అయితే, తమకు ఎలాంటి నోటీసులు అందలేదని మంత్రి జయరాం తెలిపారు. ఆలూరులోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ఛానెళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తనపై బురదజల్లేందుకు ఇలా చేస్తున్నాయని మండిపడ్డారు.

అలా కొంటే బినామీ ఎలా అవుతుందన్న జయరాం
తమది ఉమ్మడి కుటుంబమని.. 1995లో తన తల్లి సర్పంచ్‌గా, 2006లో తాను జడ్పీటీసీగా పనిచేశామని తెలిపారు ఏపీ మంత్రి జయరాం. 2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని, 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిని అయ్యానని జయరాం చెప్పారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న తాము 30 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. కుటుంబసభ్యుల పేరు మీద భూమి కొంటే బినామీ ఎలా అవుతుందని మంత్రి జయరాం ప్రశ్నించారు. కాగా, ఇటీవల తెలంగాణలో కూడా ఓ మంత్రి, ఆయన కుటుంబసభ్యులను ఐటీశాఖ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అక్కడ పలు వ్యవహారాల్లో ఈడీ విచారణలు కూడా కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications