నారాయణకు అస్వస్థత, విమానం తిప్పమన్న బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉన్న మంత్రి పీ నారాయణ ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు నారాయణ, చంద్రబాబులు వచ్చారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇద్దరు.. హైదరాబాదు వెళ్లేందుకు సాయంత్రం నాలుగున్నర గంటలకు రేణిగుంటలో ప్రత్యేక విమానం ఎక్కారు.
విమానం రన్ వే నుండి బయలుదేరి వేగం పుంజుకుంటుండగా నారాయణ అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని చంద్రబాబుకు చెప్పగా.. ఆయన విమానాన్ని తిరిగి విమానాశ్రయం వద్దకు తీసుకెళ్లాలన్నారు. విమానం విమానాశ్రయానికి చేరుకోగానే సీఎం వాహన శ్రేణిలోని వైద్య బృందం మంత్రికి వైద్య సేవలు అందించింది. అజీర్ణం కారణంగానే మంత్రి అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు. కాగా, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, సమావేశాలకు హాజరవుతానని చెప్పారు.

హస్తినకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై ప్రధాని సహా పలువురు మంత్రులతో చర్చించనున్నారు.
కేటీఆర్ ఢిల్లీకి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. 'జాతీయ గ్రామీణ నీటి సరఫరా పథకం' అమలు తీరును సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రాల తాగునీటి సరఫరా శాఖ మంత్రులు హాజరవుతారు. ఈ సమావేశంతో పాటు 'డిజిటల్ ఇండియా' అంశంపై జరిగే ఐటీ మంత్రుల సమావేశంలో కూడా కేటీఆర్ పాల్గొంటారు.












Click it and Unblock the Notifications