కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో తడాఖా చూపిన ఏపీ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ భారత్ అవార్డుల్లో ఏపీ తడాఖా చూపింది. దేశవ్యాప్తంగా ప్రకటించిన మొత్తం 24 అవార్డుల్లో ఏకంగా ఆరు పురస్కారాలను కైవసం చేసుకుంది. పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల తరలింపు, ప్లాస్టిక్ నివారణ, పౌరులలో పరిశుభ్రతపై పెరిగిన అవగాహన ప్రాతిపదికగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ఖరారు చేసింది. పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు వివిధ విభాగాల్లో ఏపీ ప్రతిభ చాటింది.
10 లక్షలకు పైగా జనాభా కలిగిన కేటగిరీలో రాష్ట్రానికి చెందిన విజయవాడ, విశాఖపట్నం.. జాతీయ స్థాయిలో అత్యుత్తమ గుర్తింపు సాధించాయి. ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణ, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించే విధానం, చెత్త రహిత నగరాలుగా తీర్చిదిద్దడానికి చేపట్టిన కార్యక్రమాలు ఈ నగరాలకు అవార్డులు తెచ్చిపెట్టాయి. నగర పాలక సంస్థలు చేపట్టిన చర్యలకు పౌరుల భాగస్వామ్యం తోడవడంతో విజయవాడ, విశాఖపట్నం నగరాలు ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో నిలిచాయి.

మూడు లక్షల నుంచి 10 లక్షల జనాభా విభాగంలో గుంటూరు, రాజమండ్రి నగరాలు స్వచ్ఛ అవార్డులను దక్కించుకున్నాయి. పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థల క్రమబద్ధీకరణ వంటి అంశాల్లో ఈ నగరాల్లో తీసుకున్న చర్యలకు ఈ గుర్తింపు లభించింది. స్వచ్ఛ షెహర్ జోడీ కేటగిరీలో కుప్పంతో కలిసి టెంపుల్ సిటీ తిరుపతి ఈ కేటగిరీలో మూడో స్థానంలో నిలిచింది. 50,000 నుంచి మూడు లక్షల జనాభా కేటగిరీలో జాతీయ స్థాయి పురస్కారాన్ని సాధించి తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది.
చిన్న పట్టణాల విభాగంలో 20,000 నుంచి 50,000 వరకు జనాభా కేటగిరీ కింద కుప్పం మున్సిపాలిటీ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. చెత్త వేరుచేయడం, వ్యర్థాల పునర్వినియోగం, స్థానిక పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల కుప్పానికి ఈ గౌరవాన్ని దక్కింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ అవార్డులను అందుకున్నారు.
సఫాయి మిత్ర భద్రతలో గ్రేటర్ విశాఖపట్నం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సూపర్ స్వచ్ఛ లీగ్‌లో విజయవాడ, గుంటూరు, తిరుపతి మూడవ స్థానంలో నిలవడం.. తమ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. రాజమండ్రి, కుప్పం కూడా జాతీయ గుర్తింపును పొందాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశుధ్య పనులకు లభించిన జాతీయ స్థాయి గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.
మున్సిపాలిటీల నిర్వహణ, సిబ్బంది నిరంతర కృషికి ఈ అవార్డులు నిదర్శనమని మంత్రి నారాయణ ట్వీట్ చేశారు. పారిశుధ్య నిర్వహణలో ఆధునిక పద్ధతులు అవలంబించడం వల్ల లభించిన ఈ పురస్కారాలు స్థానిక సంస్థలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో పారిశుధ్య ప్రమాణాలు కొనసాగిస్తూ, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కూడా స్వచ్ఛతా పోటీల్లో ముందంజ వేసేందుకు ఈ విజయం మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
