జ్యోతిష్యాన్ని నమ్ముకున్న జగన్.. ఏం సాధించలేరా? రాష్ట్ర పండుగగా 'రాజధాని' వేడుక
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. ఏపీకీ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ జగన్ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
తొలుత నిర్ణయించిన ప్రకారం... ఇప్పటికే దీక్ష ప్రారంభం కావాలి. కాని అనుమతి నిరాకరించి నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీన జగన్ దీక్షకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 7న దీక్ష కోసం వైసిపి నాలుగు స్థలాలను చూసింది. పోలీసులు అనుమతి నిరాకరిస్తే కనుక.. కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాలని వైసిపి భావిస్తోంది.
కోర్టుకు వెళ్లే కంటే ముందు పోలీసుల అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తోంది. రెండు రోజుల క్రితం.. జగన్ దీక్ష కోసం వైసిపి నేతలు రెండు స్థలాలను ప్రతిపాదించారు. సోమవారం నాడు నాలుగు స్థలాలను ప్రతిపాదిస్తూ... పోలీసులకు లేఖ అందించారు.
అయితే, ప్రత్యేక హోదా విషయంలో జగన్ దీక్ష పైన ఏపీ మంత్రులు, టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, అచ్చెన్నాయుడు, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తదితరులు సోమవారం నిప్పులు చెరిగారు.

ఎన్ని ఉద్యమాలు, ఆందోళనలు చేసినా జగన్ ఏం సాధించలేరని పల్లె ఆగ్రహించారు. జగన్‌కు దమ్ముంటే రుణమాఫీ పైన బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. వైసిపికి చెందిన వారికి కూడా తాము రుణమాఫీ చేశామన్నారు. జ్యోతిష్యాన్ని నమ్ముకొని జగన్ సీఎం కాలేరని ఎద్దేవా చేశారు.
జగన్ ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదని కెఈ కృష్ణమూర్తి విమర్శించారు. జగన్‌కు దమ్ముంటే రుణమాఫీపై బహిరంగ చర్చకు రావాలని మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు సవాల్ చేశారు. రాయలసీమలో సాగు, తాగునీరు దుర్బిక్షం తొలగించేందుకే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారన్నారు.
రాష్ట్ర పండుగగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమం
రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి శంకుస్థాపన చేయనున్నారు.
ఇటీవల సీఎం చంద్రబాబు తన సింగపూర్ పర్యటనలో ఆ దేశ ప్రధాని లీ ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రాజధాని నిర్మాణానికి భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చిన తొలి రైతుకు ఈ కార్యక్రమంలో ప్రధాని చేతుల మీదుగా జ్ఞాపికను బహుకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications