చంద్రబాబు నిర్ణయంపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రియాక్షన్ ఇదే..!
తాజాగా ఏపీ కేబినెట్ భేటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు ఓ క్లారిటీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఆప్కోస్ ద్వారా భర్తీ చేయకపోతే నేరుగా శాఖల ద్వారా తీసుకోమని వారికి స్పష్టం చేశారు. అలాగే ఇప్పటికే ఆప్కోస్ పరిధిలో ఉన్న ఉద్యోగుల్ని శాఖలకు అప్పగిస్తామన్నారు. గతంలో ఇలా శాఖల ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసుకునేందుకు అమలైన విధానాన్నే వైసీపీ ప్రభుత్వం మార్చి ఆప్కోస్ ద్వారా భర్తీ చేసింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు తాజా సూచనపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు స్పందించారు.
కూటమి ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం మెరుగైన విధానాన్ని తీసుకురావాలని ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘం అయిన ఏపీ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కోరింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను డిపార్ట్మెంట్లకు అప్పచెప్పే విషయం స్వాగతిస్తామని తెలిపింది. మళ్లీ దళారి (ప్రైవేటు ఏజెన్సీలు) వ్యవస్థ నడిపితే ఉద్యోగులు అధోగతి పాలవుతారని తెలిపింది. స్పెర్స్, మెప్మా ఉద్యోగుల మాదిరిగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సీఎంను కోరింది.

నూతన విధానంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా కల్పించిలే చర్యలు తీసుకోవాలని ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. కూటమి ప్రభుత్వంపై ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోటి ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలు అడియాశలు కాకుండా చూడాలని తెలిపింది. ఆప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థ ఏర్పాటు చేస్తారని నమ్మకంతో ఉన్నామని ఏపీ సిఓఈఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే.సుమన్, అల్లం సురేష్ బాబు తెలిపారు.
ఆప్కోస్ విధానాన్ని రద్దు చేసినా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు మరింత మెరుగైన విధానాన్ని తీసుకుని వచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉద్యోగులకు న్యాయం చేయాలని వీరు కోరారు. రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలకు కీలక శాఖల్లో సైతం పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఔట్సోర్సింగ్ వ్యవస్థను నూతన నియామకాలను అన్ని అధికారాలను ఆయా డిపార్ట్మెంట్లకు అప్పజెప్పే విషయాన్ని అందరూ స్వాగతిస్తున్నామని అయితే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications