జగన్ ఇక్కడికి రావొద్దు.. పల్నాడు పోలీసుల షాక్..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూ, పోలీసులకూ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా జగన్ పొదిలి పర్యటన సందర్భంగా భద్రత కల్పించాల్సిన పోలీసులు తమపై దాడులకు దిగిన టీడీపీ శ్రేణులకు అండగా నిలిచారని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో వారు ఇవాళ మరో షాకిచ్చారు. వైఎస్ జగన్ త్వరలో చేపట్టనున్న మరో టూర్ కు అనుమతి కోరగా నిరాకరిస్తున్నట్లు తేల్చిచెప్పేశారు. దీంతో వైసీపీ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది.
రేపు సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వెళ్లాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు జగన్ తరఫున పార్టీ నేత గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీసులకు అనుమతి కోరారు. అయితే పోలీసులు క్షేత్రస్దాయిలో పరిశీలన చేసిన తర్వాత ఈ టూర్ కు అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. ఇందుకు సంబంధించిన కారణాల్ని ఇవాళ పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

జగన్ టూర్ కు అనుమతి కోరుతూ వైసీపీ నేతలు ఇచ్చిన లేఖలో ఎంతమంది వస్తారన్న దానిపై పూర్తి వివరాలు లేవని, తమకున్న సమాచారం మేరకు 30 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అయితే విగ్రహావిష్కరణ జరిగే వీధి కేవలం 10 అడుగుల వెడల్పుతో మాత్రమే ఉందని, అక్కడ అంత మంది వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, బందోబస్తు కల్పించడం కూడా సాధ్యం కాదని తెలిపారు. కాబట్టి ఊరి చివర ఈ కార్యక్రమం నిర్వహించుకుంటే ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
తాజాగా జరిగిన ఘటనల దృష్ట్యా జగన్ టూర్ లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భంగం కలగకుండా చూసుకుంటామని హామీ ఇస్తే అనుమతి ఇచ్చే విషయంపై పరిశీలిస్తామని కూడా పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో రేపటి జగన్ టూర్ కోసం వైసీపీ ఇలాంటి హామీ ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications