రాజధాని: ప్యాకేజీ కోసం డిమాండ్, పోలీసుల మకాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ప్రభుత్వం భూమిని సేకరిస్తుండగా మరోవైపు పలువురు మండిపడుతున్నారు. కొన్నిచోట్ల స్థానికులు ప్యాకేజీ పెంచాలని కోరుతున్నారు. తుళ్లూరు మండలం వెంకటాయపాలెంకు చెందిన రైతులు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని మరికొంత పెంచాలని కోరారు. శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో గ్రామ రైతులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కాగా, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహించినప్పటికీ రైతులు పాల్గొనకుండా నిరసన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం రైతులు కోరిన విధంగా ప్యాకేజీ పెంచితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాక ఆయా గ్రామాల్లో భూముల విలువ ఎప్పుడో నాలుగు కోట్లకు పైగా ఉందని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వానికి పెంచే ఉద్దేశం లేనందునే పోలీసుల పహారా తీవ్రతరం చేసిందని అంటున్నారు. అయితే ప్రభుత్వం శనివారం రిజిస్ట్రేషన్లకు సంబంధించిన లావాదేవీలు జరుపుకునే విధంగా 398 జీవోను రద్దు చేసింది. భూ సమీకరణను వ్యతిరేకించే రైతులకు ఈ వెసులుబాటు లాభం కల్గిస్తుందనే అంచనాలను రైతులు వేస్తున్నారు.

రాజధాని గ్రామాల్లో పోలీసుల మకాం
తొలి నుంచి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న గ్రామాల్లో పోలీసులు మకాం వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సిఆర్‌డిఎ) ప్రతిపాదిత ప్రాంతాలైన తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో కొన్ని గ్రామాల రైతులు భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నారు.
ముఖ్యంగా పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు తదితర గ్రామాల్లో నిత్యం జరుగుతున్న పరిణామాలపై పోలీసులు ఆరా తీస్తున్నారంటున్నారు. గత నెల పొలాల్లో చోటు చేసుకున్న వరుస సంఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
రాజధాని అథారిటీలోకి మరో 33మంది డిప్యూటీ కలెక్టర్లు
కొత్తగా ఏర్పాటుచేసిన రాజధాని అభివృద్ధి అథారిటీలోకి భారీగా అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే 34 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం తాజాగా మరో 33 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇదే సమయంలో వివిధ శాఖల్లో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న వారిని కూడా డిప్యూటీ కలెక్టర్ల హోదాలో సీఆర్డీఏలో నియమించారు.












Click it and Unblock the Notifications