ఏపీలో సెప్టెంబర్ 1 పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన - ఇలా చేయండి..!!
ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ప్రతీ నెలా 1వ తేదీన లబ్ది దారుల ఇంటికి సచివాలయ సిబ్బంది వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. కాగా, అనర్హులు చాలా మంది పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. పెద్ద సంఖ్యలో నోటీసులు ఇచ్చారు. కాగా, అర్హత ఉండీ నోటీసులు అందుకున్న వారికి అప్పీల్ కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల వరకు పెన్షన్లు కొనసాగించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో అప్పీల్ చేసుకున్న వారికి పెన్షన్ల పంపిణీ పై సెర్ప్ కీలక ప్రకటన చేసింది.
ఏపీలో ప్రతీ నెలా ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్లు కొందరు అనర్హులకు అందుతున్నట్లు క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించారు. వారికి నోటీసులు జారీ చేసారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పెన్షన్ కోత ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అర్హత ఉన్న వారికీ పెన్షన్లు కోత వేస్తున్నారని రాజకీయంగా విమర్శలు ఉన్నాయి. దీంతో.. సెప్టెంబర్ పెన్షన్ యధాతథంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో అధికారులు జారీ చేసిన నోటీసుల విషయంలో ఇప్పుడు సెర్ప్ కీలక సూచన చేసింది. దివ్యాంగులు, ఆరోగ్య పెన్షన్లకు సంబంధించి పునఃపరిశీలన అప్పీల్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

పలు కేటగిరీలకు చెందిన పెన్షన్లను ఎనిమిది నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ తనిఖీ చేస్తోంది. 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది. అర్హులు ఉంటే అప్పీల్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో అప్పీల్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ నెల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం సాయంత్రం లోగా ఇందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంకా అర్హులు ఉంటే అప్పీల్ చేయించే బాధ్యతను కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లకు అప్పగించారు. ఇక.. సెప్టెంబర్ 1వ తేదీన అన్నమయ్య జిల్లాలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పెన్షన్ రద్దు కాదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications