రుషికొండను 4 రకాలుగా వాడుకోవచ్చు..! ఛాన్స్ ఇమ్మన్న స్టార్ హోటల్స్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ కోసం విశాఖ శివార్లలో రుషికొండపై నిర్మించిన పర్యాటకశాఖ భవనాల సముదాయం (టూరిజం కాంప్లెక్స్ )పై గతంలో తీవ్ర విమర్శలు చేసిన కూటమి పార్టీలు.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిన్నర తర్వాత కూడా దాన్ని ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం రుషికొండను ఎలా వాడుకోవాలో సలహాలు ఇమ్మని బహిరంగ ప్రకటన ఇచ్చింది.
దీనిపై స్పందించిన ఏపీ స్టార్ హోటళ్ల ససమాఖ్య ఇవాళ పలు సూచనలు చేస్తూ టూరిజం శాఖ కార్యదర్శి ఆమ్రపాలికి ఓ లేఖ రాసింది. ఇందులో స్టార్ హోటళ్ల సంఘం నాలుగు సూచనలు చేసింది. వీటిలో ఏదో ఒకటి అమలు చేస్తే రుషికొండను సమర్ధంగా వాడుకోవచ్చని, దీని వల్ల అందరికీ మేలు జరుగుతుందని సూచించింది. ఈ మేరకు రుషికొండతో పాటు దాని పక్కనే ఉన్న భూమిని సైతం ఎలా వాడుకోవచ్చో సూచిస్తూ ఆమ్రపాలికి లేఖ రాసింది.

ఇందులో తొలి ఆప్షన్ గా విదేశీ కాన్సులేట్ కు ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం ఏపీలో అమెరికా, యూఏఈ, సింగపూర్ కాన్సులేట్లు లేవని, ఇందులో ఏదో ఒక దేశానికి కాన్సులేట్ కోసం ఈ భవనాన్ని ఆఫర్ చేస్తే ప్రయోజనం ఉంటుందని సూచించింది. రెండవ ఆప్షన్ గా పీపీపీ విధానంలో దీన్ని అభివృద్ధి చేసేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ కార్పోరేట్ బ్రాండ్లను ఆహ్వానించాలని కోరింది. ఇలా దీర్ఘకాలం లీజుకు ఇస్తే ప్రభుత్వానికి ప్రయోజనంతో పాటు ఉద్యోగాలు కూడా వస్తాయని తెలిపింది.
మూడవ ఆప్షన్ గా రుషికొండను ఇంటిగ్రేటెడ్ టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలని స్టార్ హోటళ్ల అసోసియేషన్ సూచించింది. ఇందులో బీచ్ రిసార్ట్స్, కన్వెన్షన్ డెస్టినేషన్, బాంకెట్ హాల్స్, వెడ్డింగ్ వెన్యూస్, బీచ్ ఫ్రంట్ డైనింగ్, వాటర్ స్పోర్ట్స్, అభివృద్ధి చేస్తే విశాఖ బ్రాండ్ ను ప్రమోట్ చేయొచ్చని సూచించింది. అలాగే నాలుగో ఆప్షన్ గా స్ధానిక సంస్కృతి, కలినరీ టూరిజం అభివృద్ధికి వాడుకోవాలని సూచించింది. ఇందులో ఏపీ కుజిన్ ఫుడ్ కోర్ట్స్, క్రాఫ్ట్ హాట్, ట్రైబల్ ఆర్ట్, సాంస్కృతిక ప్రదర్శనలకు వాడుకోవాలని తెలిపింది. బీచ్ ఫెస్టివల్స్, అంతర్జాతీయ ఫుడ్, మ్యూజిక్ ఈవెంట్స్ కూడా పెట్టుకోవచ్చని తెలిపింది.

ఈ మేరకు రుషికొండను గ్లోబల్ టూరిజం ఐకాన్‌గా మార్చడానికి వర్కింగ్ గ్రూపులు, కాన్సెప్ట్ డెవలప్‌మెంట్ , కార్యాచరణ మార్గదర్శకత్వం ద్వారా టూరిజం కార్పోరేషన్ కు సహకరించడానికి తమ అసోసియేషన్ తో పాటు దాని సభ్యుల హోటల్స్ సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. 17 అక్టోబర్ 2025న జరిగే సంప్రదింపుల సమావేశంలో వివరణాత్మక ప్రతిపాదనను సమర్పించడానికి ఈ మేరకు అవకాశం ఇవ్వాలని కోరింది.












Click it and Unblock the Notifications