చంద్రబాబుకేం జరిగినా సర్కారుదే బాధ్యత-కోర్టులు జోక్యం చేసుకోవాలన్న టీడీపీ...
ఏపీలో స్కిల్ స్కాం కేసులో అరెస్టు తర్వాత రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకడం, ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం వంటి పరిస్దితుల నేపథ్యంలో తాజా పరిస్ధితిపై పార్టీ నేతలు చర్చించారు. ఇవాళ సమావేశమైన టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. ఓవైపు కోర్టుల్లో పోరాటం చేస్తూనే మరోవైపు జనంలోకి వెళ్లాల్సిన అవసరంపై నేతలు మాట్లాడారు.
అనంతరం మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారిందని ఆయన తెలిపారు. చంద్రబాబు తప్పనిసరిగా ఏసీలో ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. డీ హైడ్రేషన్,చర్మం అలెర్జీ ప్రమాదంగా మారిందని అచ్చెన్న వెల్లడించారు. చర్మం అలెర్జీ ఉంటే చంద్రబాబు వ్యక్తిగత వైద్యులను ఎందుకు పంపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రభుత్వం వైద్యులను భయపెట్టి రిపోర్టులు రాయిస్తుందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు కు ఎయిమ్స్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం అందించాలన్నారు. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు ప్రాణాలకు హాని తలపెట్టాలనే కుట్ర జరుగుతుందని అచ్చెన్న ఆరోపించారు. కోర్టులు జోక్యం చేసుకుని చంద్రబాబు కు వైద్యం అందించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. చంద్రబాబు కు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
నిన్న రాజమండ్రి జైల్లో చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు వార్తలు రావడంతో స్పందించిన ప్రభుత్వం తక్షణం వైద్యుల్ని పంపి పరీక్షలు చేయిస్తోంది. స్కిన్ డాక్టర్లను అక్కడికి పంపింది. అలాగే తాజా పరిస్ధితిపై హెల్త్ బులిటెన్లు కూడా విడుదల చేస్తోంది. అయితే ఇందులో డాక్టర్లు చెబుతున్న వివరాలపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వమే వారిని భయపెట్టి ఇలాంటి రిపోర్టులు ఇప్పిస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications