ఏపీలో రేపటి నుంచే టీచర్ల బదిలీలు-కోర్టులకు వెళ్లొద్దంటూ బొత్స వినతి...
ఏపీలో ప్రభుత్వం బదిలీలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ ఇవాళ జీవో జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించింది. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకూ ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అదే సమయంలో ఉపాధ్యాయులకు మాత్రం రేపటి నుంచే బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ వెల్లడించారు.
ఉపాధ్యాయసంఘాలతో ఇవాళ భేటీ అయిన విద్యామంత్రి బొత్స సత్యనారాయణ వారితో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించి సంఘాల నుంచి సలహాలు తీసుకున్నారు. అనంతరం ఆయన కీలక ప్రకటన చేశారు. రేపటి నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేపడుతున్నట్లు ప్రకటించారు.

రేపటి నుంచే బదిలీల ప్రక్రియ చేపడుతున్నట్లు ప్రకటించిన విద్యామంత్రి బొత్స..నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతుందని హామీ ఇచ్చారు. దీంతో పాటు 350 గ్రేడ్ 2 ఉపాధ్యాయులు, 9269 మంది ఎస్జీటీలకు ప్రమోషన్లు కల్పిస్తామన్నారు. 1746 పీజీ టీచర్ల పునర్విభజన ప్రక్రియ కూడా రేపే మొదలు పెట్టబోతున్నట్లు బొత్స వెల్లడించారు. 675 ఎంఈవో 2 పోస్టులకు సంబంధించి రేపే జీవో ఇస్తామని కూడా బొత్స తెలిపారు.
రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని బొత్స పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోగా ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు. వీటిపై కోర్టులకు వెళ్లి అడ్డుపడొద్దని ఉపాధ్యాయ సంఘాలకు బొత్స విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో లోటుపాట్లపై ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయి సూచనలు, సలహాలు తీసుకున్న మంత్రి.. కోర్టు కేసులు లేకుండా సాఫీగా ప్రక్రియ ముగుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications